భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని మొదట రోబోట్లు ఆపరేట్ చేస్తాయి.. ఆ తర్వాత..: ఇస్రో చీఫ్ సోమనాథ్
ఇండియా స్పేస్ స్టేషన్‌కు "భారతీయ అంతరిక్ష కేంద్రం''గా పేరు పెట్టనున్నారు.

Dr S Somanath: భారత్ సొంతంగా నిర్మించనున్న అంతరిక్ష కేంద్రాన్ని మొదట రోబోట్లు ఆపరేట్ చేస్తాయని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇండియా స్పేస్ స్టేషన్‌కు “భారతీయ అంతరిక్ష కేంద్రం”గా పేరు పెట్టనున్నారు. 2035 నాటికి దీన్ని ప్రారంభించాలని భారత్ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఇటీవలే ప్రతిపాదనను ఆమోదించింది.
ఇందుకు సంబంధించిన డిజైన్ మాడ్యూల్స్‌కు ఆమోద ముద్ర వేయించుకునేందుకు ప్రస్తుతం ఇస్రో ఎదురుచూస్తోంది. తమ వద్ద అందుబాటులో ఉన్న ప్రయోగ సామర్థ్యాలతో ఇస్రో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
దీని గురించి సోమనాథ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని” మరింత రోబోటిక్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే, ప్రస్తుతం ఎంతో పనిని రోబోట్లే చేస్తున్నాయని చెప్పారు. మైక్రోగ్రావిటీతో ఉండే ప్రత్యేకమైన పర్యావరణంలో నిర్మించే అంతరిక్ష కేంద్రానికి ప్రయోగ పరికరాలను పంపించాల్సి ఉంటుందని తెలిపారు. మొదటి దశలో రోబోటిక్స్‌నే పంపుతామని, ఆ తర్వాత వ్యోమగాములతో సాధారణ మిషన్ ఉంటుందని చెప్పారు.
మరోవైపు, 2028 నాటికి వీనస్ ఆర్బిటర్ మిషన్‌ను పూర్తి చేయాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే భారత్ మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. అయితే, శుక్రగ్రహం పరిస్థితులు భిన్నంగా ఉంటాయని సోమనాథ్ తెలిపారు అక్కడ ఇతర గ్రహాల కంటే వాతావరణ పీడనం అధికంగా ఉంటుందని అన్నారు.
శుక్రుడి చుట్టూ చుట్టూ దట్టమైన మేఘాలు ఉంటాయని తెలిపారు. దీంతో కక్ష్య చుట్టూ ఉపగ్రహాన్ని పెట్టి అక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసి, గణాంకాలను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
కాగా, సునితా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన అంశంపై సోమనాథ్ స్పందిస్తూ.. బోయింగ్ స్టార్‌లైనర్ వ్యవహారం భారత గగన్‌యాన్ ప్రణాళికలపై ఎలాంటి ప్రభావమూ చూపలేదని స్పష్టం చేశారు.