Saif Ali Khan Attack: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు.. ముంబై పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కరీనా ఏం చెప్పిందంటే?
సైఫ్ అలీఖాన్ పై దాడికేసుకు సంబంధించి ముంబై పోలీసులు కరీనా కపూర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

Saif Ali Khan Attack
Saif Ali Khan Attack: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని ముంబయిలోని లీలావతి వైద్యులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సైఫ్ నివాసంలోకి దుండగుడు చొరబడి దాడిచేసిన విషయం తెలిసిందే. కత్తితో దాడిచేయడంతో సైఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఆటోలో లీలావతి ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు వెంటనే చికిత్స అందించారు. దీంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. సైఫ్ ను ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలించారు. ఈనెల 21న ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు సైఫ్ పై దాడిచేసిన వ్యక్తికోసం ముంబై పోలీసులు వెతుకుతున్నారు.
శుక్రవారం నిందితుడ్ని ముంబై పోలీసులు పట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇంకా నిందితుడు పట్టుబడలేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు. సైఫ్ ఇంట్లో రెండు రోజుల క్రితం పనిచేసిన కార్పెంటర్ వారిస్ అలీ సల్మానీని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం అతడ్ని విడిచిపెట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే, నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. 30 పోలీసు బృందాలు సైఫ్ పై దాడిచేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే, నిందితుడి వెనుక అండర్ వరల్డ్ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, పోలీసుల ప్రాథమిక విచారణలో అతనికి ఎటువంటి ముఠాలతో సంబంధం లేదని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది.
సైఫ్ అలీఖాన్ పై దాడికేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటి వరకు 40 నుంచి 50 మందిని విచారించినట్లు తెలిసింది. సైఫ్ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. దాడి జరిగిన రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని తన వాగ్మూలంలో కరీనా పేర్కొన్నారు. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. నిందితుడు దాడికి పాల్పడిన సమయంలో ఎంతో ఆవేశంగా ఉన్నాడు. ఇంట్లోని పిల్లలను, మహిళలను నిందితుడి నుంచి కాపాడేందుకు సైఫ్ ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సైఫ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. మా చిన్న కుమారుడు జహంగీర్ గదిలోకి నిందితుడు చొరబడ్డాడు. అతడు, నా చిన్న కుమారుడిపై దాడి చేయబోతున్నట్లు అనిపించింది. సైఫ్ అతన్ని అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే పిల్లలు, మహిళలను 12వ అంతస్తుకు పంపించాడు. సైఫ్ పై దాదాపు ఆరు సార్లు నిందితుడు కత్తితో దాడిచేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని కరీనా పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో పేర్కొంది.
నిందితుడు ఇంట్లో ఎలాంటి వస్తువును దొంగిలించలేదని, ఆభరణాలు, ఇంటిలోని ఇతర విలువైన సామాగ్రి భద్రంగానే ఉన్నాయని కరీనా కపూర్ తన వాగ్మూలంలో పేర్కొన్నారు. అయితే, దాడి జరిగిన తరువాత కరీనా కపూర్ తీవ్ర భయాందోళనకు గురైందని, దీంతో ఘటన తరువాత సోదరి కరిష్మా కపూర్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.