Save Aravalli
Save Aravalli : కేంద్రం ఇచ్చిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించిన తరువాత ‘సేవ్ అరావళి’ ప్రచారం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కేంద్రం నిర్ణయం, సుప్రీంకోర్టు తీర్పు పర్యావరణ వేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిర్ణయాలు.. ఆరావళికి డెత్ వారెంట్ అంటూ కొందరు పేర్కొంటున్నారు. అయితే, కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంది.. సుప్రీంకోర్టు ఏమని ఆమోదించింది.. ఆరావళికి వచ్చే ముప్పు ఏమిటి.. సేవ్ ఆరావళి ప్రచారం సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతోంది.. అనే విషయాలపై ఇక్కడ తెలుసుకుందాం..
Also Read : Pawan Kalyan : వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. పద్దతి మార్చుకోవాలి.. తాట తీస్తాం..
భారత దేశంలో పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణి గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉంది. ఈ పర్వతాలు దేశ చారిత్ర, భౌగోళిక శాస్త్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సుమారు 700 కిలోమీటర్ల పొడవున పర్వత శ్రేణి విస్తరించి ఉంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2024లో ఒక విషయం చెప్పింది. ఆరావళిలోని తక్కువ ఎత్తు ఉండే పర్వతాలు.. థార్ ఎడారి నుంచి వచ్చే ధూళి, ఇసుకను అడ్డుకోవడంలో సహజ కవచంగా పనిచేస్తోందని తెలిపింది. ఇది ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంతో సహా బహుళ రాష్ట్రాలకు భూగర్భ జల రీఛార్జ్, గొప్ప జీవవైవిధ్యాన్ని నిలబెట్టేందుకు సహాయపడుతుంది.
గత కొంతకాలంగా ఆరావళి పర్వతాలపై ఖనిజాలకోసం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అందువల్ల క్రమంగా కొండలు తరిగిపోతున్నాయి. పర్యావరణం దారితప్పుతోంది.. ఈ పర్వతాలు తరిగిపోతూ ఉంటే చలిగాలులు ముందుగానే ఇండియాలోకి వచ్చేస్తాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ పర్వతాల్లో 100 మీటర్ల కంటే (328 అడుగులు) తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ జరుపుకోవచ్చునని అనుమతి ఇచ్చింది. కేంద్రం తీరుపై పర్యావరణ వేత్తల నుంచి, పలు పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
100మీటర్లలోపు ఉన్న వాటిని ఆరావళి పర్వతాలుగా చెప్పలేమని, పర్వతం అనేది 100 మీటర్ల కంటే ఎత్తే ఉంటుందనీ,.. అందువల్ల తాము పర్మిషన్ ఇచ్చింది పర్వతాల్ని తొలిచేందుకు కాదని కేంద్రం పేర్కొంది. స్థానిక భూభాగాల నుండి కనీసం 100 మీటర్ల ఎత్తులో ఉన్న కొండలు లేదా ఒకదానికొకటి 500 మీటర్లలోపు ఉన్నటువంటి కొండల సమూహాలు మాత్రమే ఇప్పుడు ఆరావళి శ్రేణిలో భాగంగా గుర్తించబడతాయని కేంద్రం పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కేంద్రం పర్వతాలకు కొత్త నిర్వచనం ఇవ్వడంతో ఆరావళిలోని 90శాతం ప్రాంతాలకు మైనింగ్ ముప్పు పొంచి ఉంది. అదే జరిగితే, దిల్లీ వరకు థార్ ఎడారి విస్తరించే ప్రమాదముంది. భూగర్భజలాలు అడుగంటుతాయి. గాలి నాణ్యత మరింత దెబ్బతింటుంది. అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Save Aravalli.
Save our air, water, and future! 🆘 pic.twitter.com/2WSJk778CN— Vikas Chhikara (@VikasChhikara_) December 20, 2025
కేంద్రం ఇచ్చిన సిఫార్సులను 2025 నవంబర్ 20వ తేదీన సుప్రీంకోర్టు ఆమోదిస్తూ తీర్పు ఇచ్చింది. మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవై నేతృత్వంలోని న్యాయమూర్తులు కె. వినోద్ చందర్, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులను ఆమోదించింది. ఆరావళి పర్వతశ్రేణుల స్వరూపాన్ని మార్చడానికి మాత్రం వీల్లేదని తేల్చిచెప్పింది. చుట్టూ మైనింగ్ జరుగుతుంటే… పర్వతాల స్వరూపం కచ్చితంగా మారిపోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
సుప్రీంకోర్టు నిర్ణయం తరువాత పురాతన పర్వత వ్యవస్థల్లో ఒకటైన ఆరావళి కొండలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సుప్రీం తీరుపై పర్యావరణ వేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘సేవ్ ఆరవళి’ హ్యాష్‌ట్యాగ్‌తో ఆరావళిని రక్షించాలని సోషల్ మీడియా వేదికగా నిపుణులు, పర్యావరణ కార్యకర్తలు పిలుపునిస్తున్నారు.
ఆరావళి పర్వత శ్రేణికి ఏదైనా నష్టం జరిగితే ఉత్తర భారతదేశంలోని పర్యావరణ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని పునఃపరిశీలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆరావళి శ్రేణిలో మైనింగ్, పర్యావరణ రక్షణలపై పెరుగుతున్న చర్చల మధ్య దేశవ్యాప్తంగా ‘సేవ్ అరవల్లి’ ప్రచారానికి మద్దతుగా కాంగ్రెస్ నాయకుడు తన సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని కూడా మార్చారు. అంతేకాదు.. ఆరావళిని టేప్ కొలతలు లేదా ఎత్తు ద్వారా మాత్రమే అంచనా వేయలేము. దాని పర్యావరణ ప్రాముఖ్యత ద్వారా దానిని అంచనా వేయాలని గెహ్లాట్ అన్నారు.