పిల్లల పొట్టగొట్టి : 10వేల కేజీల మధ్యాహ్న భోజనం అమ్మేశారు

పిల్లలకు మధ్యాహ్న భోజనమైనా దొరుకుతుందనే ఆశతో స్కూల్‌కు పంపే పేరెంట్స్ ఉన్నప్పటికీ.. అది కూడా దక్కకుండా వర్కర్లంతా కలిసి భోజనాన్ని అమ్మేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలి, కన్నవు ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగిలించిన ఆహారాన్ని రాయ్ బరేలిలోని పశువులు ఉండే చోట దాచిపెట్టారు. 9వేల 3వందల కేజీలు ఉన్న 155 సంచులను అధికారులు కనుగొన్నారు.
ఈ ఘటన వెలుగు చూడడంతో 17మంది అంగన్వాడీ వర్కర్లను విధుల నుంచి తొలగించారు. ‘ఇదే కాకుండా నలుగురు సూపర్ వైజర్లను, ముఖ్య అధికారులను సస్పెండ్ చేశారు’ అని అధికారులు వెల్లడించారు. ఆహారాన్ని దాచి ఉంచిన గోడౌన్ ఆపరేటర్లను జైలుకు పంపారు. ఈ ఆహారాన్ని అక్రమంగా గోడౌన్ లలో ఉంచడమే కాక అనధికారికంగా అమ్ముకునేవారు.
సెప్టెంబరు మొదటి వారంలో మధ్యాహ్న భోజనంలో చపాతీలు, ఉప్పు పెడుతున్నారని వార్తలు రాసినందుకు ఉత్తరప్రదేశ్ జర్నలిస్టుని అరెస్టు చేశారు. మీర్జాపూర్‌లోని స్కూల్లో ఈ ఘటన జరిగింది. వీడియోతో సహా బయటపెట్టడంతో పిల్లలు రోటీ, ఉప్పు తింటూ ఉన్న విషయం వెలుగు చూసింది. ఆ తర్వాత ఈఘటనపై ఎంక్వైరీ వేసి టీచర్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం.