Russia-Ukraine Crisis: ఢిల్లీ చేరిన రెండో విమానం.. మొత్తం 469 మంది విద్యార్థులు సేఫ్

బుధవారం 219 మందితో కూడిన విమానం ఢిల్లీకి చేరుకోగా.. శనివారం రాత్రి 250 మందితో మరో విమానం కూడా ఢిల్లీకి చేరుకుంది.

Russia Ukraine Crisis (1)

Russia-Ukraine Crisis: యుక్రెయిన్ లో నెలకొన్న భీకర యుద్ధం, ఎమర్జెన్సీ పరిస్థితులు గురించి తెలిసిందే. ఆ దేశంపై రష్యా మూడు వైపుల నుండి దాడులకి దిగింది. చావో రేవో తేల్చుకుంటాం కానీ వెనక్కి తగ్గేది లేదని యుక్రెయిన్ కూడా ఎదుర్కొనేందుకు తీవ్రంగా పోరాడుతుంది. దీంతో దేశంలో సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఆ దేశంలో మన భారతీయులు కూడా ఉండగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్​ గంగా’లో భాగంగా వాళ్ళని వెనక్కి తీసుకొస్తుంది.

యుక్రెయిన్ లో ఉన్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ఇప్పటికే అక్కడకు విమానాలు పంపగా.. ముందుగా 219 మందితో కూడిన విమానం ఢిల్లీకి చేరుకోగా.. శనివారం రాత్రి 250 మందితో మరో విమానం కూడా ఢిల్లీకి చేరుకుంది. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రెండో ఎయిర్ ఇండియా విమానం 250 మంది భారత విద్యార్థులతో ఢిల్లీకి చేరుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్ విద్యార్థులకు స్వాగతం పలికారు.

ఉక్రెయిన్​ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఉక్రెయిన్​లో చిక్కుకున్న ఇతర భారతీయులకు కూడా ధైర్యం చెప్పాలని మంత్రులు సూచించారు. సురక్షితంగా భారత్​కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా ఉండగా .. ఆ విద్యార్థులను రిసీవ్ చేసుకునేందుకు ఏపీ, తెలంగాణ భవన్ అధికారులు ముందుగానే ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. 250 మందిలో తెలంగాణకి చెందిన విద్యార్థులు 17 మంది, ఏపీకి చెందిన 11 మంది ఉన్నారు. కాగా ఏపీ విద్యార్థులను ఢిల్లీ నుంచి నేరుగా ఏపీకి వెళ్లే విమానాల్లో వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ విద్యార్థులు వివేక్, శ్రీహరి, తరుణ్, నిదిష్, లలితా, దేవి, దివ్య, మనీషా, రమ్య, ఐశ్వర్య, మాన్య, మహిత, ప్రత్యూష, గీతిక, లలిత, తరణిలను తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ రిసీవ్ చేసుకున్నారు.

మొత్తం ఢిల్లీ చేరుకున్న 28 మంది తెలుగు విద్యార్థులలో ఆర్.అనూష, ఎస్.ఫర్జానా, ఎస్.సాయి, బి.వంశీ, ఎం.అభిషేక్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానుండగా.. సి.తేజస్విని, కోహిమా వైశాలి, పి.సూర్య సాయి ఢిల్లీ నుంచి వైజాగ్ వెళ్లనున్నారు. కె.గౌతమి, టి.హర్షిత, పి.జయ శ్రీ ఢిల్లీ నుంచి బెంగుళూరు వెళ్లనున్నారు. ఏపీకి చెందిన కొందరు విద్యార్థులను ఏపీ ప్రభుత్వం నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్, వైజాగ్, బెంగుళూరుకు పంపించే ఏర్పాట్లు చేసింది.