High court : వివాహితకు లవ్ లెటర్ రాసిన వ్యక్తికి రూ.90వేల జరిమానా

వివాహితలకు లవ్ లెటర్ ఇచ్చిన ఓ వ్యక్తికి బాంబే హైకోర్టు 90,000 జరిమాని విధిచింది. వివాహితకు లవ్ లెటర్ ఇవ్వటం ఆమె నిబద్ధతను శంకించడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.

High court : వివాహితకు లవ్ లెటర్ రాసిన వ్యక్తికి రూ.90వేల జరిమానా

Mumbai Hc

Updated On : August 11, 2021 / 2:27 PM IST

High court : ఓ వివాహితకు లవ్ లెటర్ రాసిన వ్యక్తికి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. భారీ జరిమానా విధించింది. బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ తుది తీర్పు వెల్లడించింది. నిందితుడికి 90 వేల రూపాయలను జరిమానాగా విధించింది. అందులో రూ.85 వేలు బాధిత మహిళకు చెందాలని పేర్కొంది. ఈ తీర్పు సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ..వివాహితకు ప్రేమ‌ లేఖ పంపడమంటే ఆమెను అవమానించినట్లేన‌ని బాంబే హైకోర్టు పేర్కొంది.

వయస్సు పెరిగినా బుద్ది లేని కొంతమందికి ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు.ఆడవాళ్లంటే ఆటవస్తువులు అన్నట్లుగా చూస్తారు. అటువంటి ఓ 54 ఏళ్ల ప్రబుద్ధుడు..ఓ వివాహితకు లవ్ లెటర్ రాశాడు. దీంతో ఆమెకు ఒళ్లు మండిపోయింది. ఏంటీ వెధవ్వేషాలు అంటూ మండిపడినా వినలేదు. తిట్టినా పట్టించుకోలేదు. పైగా ‘ఐ లవ్వ్యూ’ అంటూ చెప్పాడు. దీంతో సదరు మహిళ ఫిర్యాదు చేయటంతో హైకోర్టు సదరు ప్రబుద్ధుడికి భారీ జరిమానా విధిస్తూ తీర్పుచెప్పింది.

మ‌హారాష్ట్ర‌లోని అకోలాలోని ఓ కిరాణ దుకాణ యజమాని 2011 అక్టోబర్ 3న త‌మ వ‌ద్దే పనిచేసే ఓ వివాహితకు ప్రేమలేఖ ఇవ్వడానికి యత్నించాడు. అది చూసిన ఆమె ఇదేంటీ అని అడిగింది. దానికి అతను నా ప్రేమనంతా ఈ లెటర్ లో రాశాను. ఇదిగో అంటూ ఇవ్వబోయాడు. కానీ దాన్ని తీసుకోవటానికి ఆమె ఒప్పుకోలేదు. ఏంటీ వెధవ్వేషాలు..మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపో అంటూ కసిరింది. అయినా అతను వినలేదు. ‘ఐలవ్వ్యూ’ అంటూ చెప్పి..లెటర్ ఆమెపై విసిరి వెళ్లిపోయాడు. అంతేగాక‌, ఆ మరుస‌టి రోజు కూడా ఆ వివాహిత‌ను విసిగించాడు. నీ సమాధానం ఏంటీ అంటూ పదే పదే అడుగుతూ విసిగించాడు. పైగా నా గురించి ఎవ్వరికీ చెప్పొద్దు అంటూ బెదిరింపులకు దిగాడు.

అతని వేధింపులు భరించలేని సదరు బాధితురాలు అకోలాలోని సివిల్‌లైన్‌ పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేయ‌డంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చివ‌ర‌కు 2018 జూన్‌ 21న సెషన్స్‌ కోర్టు ఆ దుకాణ య‌జ‌మానికి రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.40 వేల జరిమానా విధించింది.దీంతో సెష‌న్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అతడు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచార‌ణ చేపట్టిన న్యాయస్థానం షాపు యజమానిని విచారించగా..ఎదురు ఆమెపై అతను నిందలు మోపాడు. తన దుకాణంలో సరకులు తీసుకుని డబ్బులు చెల్లించలేదని..డబ్బు చెల్లించాల‌ని అడిగినందుకు తనపై ఆరోప‌ణ‌లు చేసింద‌ని చెప్పుకొచ్చాడు.

కానీ అతని ఆరోపణలను న్యాయస్థానం నమ్మలేదు. అతను మ‌హిళ‌ను వేధించ‌డ‌నటానికి ఆధారాలున్నాయని పేర్కొంటూ..సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. వివాహిత‌ను వేధించినందుకు ఆ దుకాణ య‌జ‌మాని అప్పటికే 45 రోజులు జైలుశిక్ష అనుభవించగా హైకోర్టు నేరం జరిగిన కాలాన్ని..శిక్ష అనుభవించిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని..జరిమానాను మాత్రం రూ.90 వేలకు పెంచుతూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సదరు షాపు యజమానికి దిమ్మ తిరిగిపోయింది. ఓ వివాహత ప‌ట్ల..ఇష్టంలేదని చెప్పినా వేధించటం అనేది నేరమని పేర్కొంది. అలా ప్ర‌వ‌ర్తించ‌డం ఆమె నిబద్ధతను శంకించడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.