రాజకీయాలు మనుషులను విడదీస్తాయి. బంధుత్వాలను తెంచేస్తాయి. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత కుటుంబంది కూడా ఇప్పుడు అదే పరిస్థితి. వారసుడు అనుకొన్న అన్న కొడుకు అజిత్ పవార్ పార్టీని చీల్చడం దేశ రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో సంచలనం అవగా.. దీంతో కుటుంబంలో కూడా చీలిక ఏర్పడినట్టు అయ్యింది. అధినేత శరద్ పవార్‌కు కుడిభుజమైన అజిత్.. ఊహించని విధంగా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో చేతులు కలిపారు.
అజీత్ పవార్ కలవడంతో మహారాష్ట్రలో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అజీత్ పార్టీని ఎదిరించి, తండ్రి స్థానంలో ఉన్న శరత్ పవార్‌ని కాదని, బీజేపీకి మద్దతు ప్రకటించడం వెనుక కుటుంబంలో తనకు ఉన్న అభద్రత భావం కూడా ఒక కారణం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అసలు విషయం ఏమిటంటే.. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్న అనంతరావు కుమారుడే అజిత్ పవార్. చిన్నాన్న శరద్ పవార్‌ను స్ఫూర్తిగా తీసుకొని మహారాష్ట్ర కో-ఆపరేటివ్ రంగాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయంగా అంచలంచెలుగా ఎదిగారు. శరద్ పవార్‌కు రాజకీయ వారసుడు అజిత్ పవార్ అని అందరూ అనుకొన్నారు.
కానీ అంతలోనే అజిత్‌కు శరద్ పవార్ సుప్రియా సూలే రూపంలో అనుకోని పరిస్థితి ఎదురైంది. 2009 పార్లమెంటరీ ఎన్నికల్లో సుప్రియా సూలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో అజిత్ పవార్‌కు సమాంతరంగా నాయకత్వం ఏర్పాటైంది. అయితే నాయకత్వం విషయంలో తమ మధ్య ఎలాంటి పోటీ లేదని పలుమార్లు సుప్రియా, అజిత్ బహిరంగంగానే ప్రకటనలు చేస్తూ వచ్చారు.
కానీ ఎంపీగా మారిన సుప్రియ సూలే రాష్ట్రంలోనే కాదు. జాతీయ స్థాయిలో తనదైన శైలిలో దూసుకెళ్లింది. యూత్‌కి బాగా దగ్గరైంది. భావి ఎన్‌సీపీ నాయకురాలుగా ఆమెను పార్టీనే కాక ప్రజలు గుర్తించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో అజిత్‌లో అభద్రతాభావం పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే శరద్ పవార్ కుటుంబంలో అధిపత్యం పోరు కొనసాగుతుండగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ తన కుమారుడు పార్థ్ పవార్‌ను మావల్ స్థానం నుంచి పోటీ చేయించాడు శరద్ పవార్. ఇది శరద్ పవార్‌కు ఇష్టం లేదు. అయినా కూడా మావల్ స్థానం నుంచి తన కుమారుడు పార్థ్ పవార్‌ను పోటీ చేయించినా.. గెలిపించుకోలేకపోయారు అజీత్. అజీత్ శాయశక్తులా ప్రయత్నించినా పార్థ్ పవార్ అక్కడ ఓడిపోవడానికి కారణం శరద్ పవార్ అని భావించారు అజిత్ పవర్.
తొలిసారి పోటీ చేసి పార్థ్ ఓటమి పాలవ్వడం పవార్ కుటుంబంలో గందరగోళానికి కారణమైంది. బారామతి నుంచి సుప్రియా సూలే గెలిచినా ఆ కుటుంబం గెలుపు వేడుకలు జరుపుకోలేదు. ఈ క్రమంలోనే అజీత్ బీజేపీకి మద్దతు ఇచ్చి ఉప ముఖ్యమంత్రి కావడంతో పార్టీ, ఫ్యామిలీలో దారుణమైన చీలిక వచ్చింది అని వ్యాఖ్యలు చేసింది సుప్రీయ సులే. దీంతో శరద్ పవార్ పార్టీలోనే కాకుండా ఫ్యామిలీలో కూడా చీలిక తప్పలేదనే మాట మహారాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్నది.