లాక్ డౌన్ కొనసాగించాల్సిందే – బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)

  • Published By: madhu ,Published On : April 7, 2020 / 01:59 AM IST
లాక్ డౌన్ కొనసాగించాల్సిందే – బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)

Updated On : April 7, 2020 / 1:59 AM IST

కరోనా మహమ్మారిపై భారతదేశం యుద్ధమే చేస్తోంది. అమెరికా, బ్రిటన్‌, ఇటలీ, స్పెయిన్‌లాంటి అగ్ర దేశాలు కరోనా రాకాసితో అల్లాడుతుంటే.. భారత్‌లో ఆ పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ అనే ఆయుధాన్ని ప్రయోగించినందునే భారత్‌ కరోనా అనే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగింది.  వైరస్‌ గొలుసును అడ్డుకోగలుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనాసాగుతోంది. ఈనెల 14తో లాక్‌డౌన్‌ ముగియనుండడంతో.. ఆ తర్వాత ఏంటన్న ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. లాక్‌డౌన్‌ కొనసాగుతుందా.. లేక  ప్రభుత్వం దీన్ని ఎత్తేస్తుందా అన్న చర్చ సాగుతోంది.

భారత్‌లో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 4వేలకు చేరింది. వంద మందికి పైగా కరోనాతో పౌరులు చనిపోయారు. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లో జరిగిన నష్టం చాలా స్వల్పమైనదే. అమెరికా, జపాన్‌, స్పెయిన్‌లాంటి దేశాలతో పోలిస్తే.. మన దేశంలో కేసుల సంఖ్య చాలా స్వల్పంగా నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. 130 కోట్ల జనాభా కలిగిన భారత్‌లాంటి దేశంలో ఇప్పటి వరకు 4వేల కేసులే బయటపడటం ఒక రకంగా వైరస్‌పై విజయం సాధిస్తున్నట్టే అనిపిస్తోంది.(తెలంగాణ Fact Check : తప్పుడు సమాచారం ఇచ్చారో తాట తీస్తారు)

ఢిల్లీలో జరిగిన జమాత్‌ సదస్సుతో ఈ కేసులు వారంలోనే ఎక్కువయ్యాయి. అది కూడా లేకుంటే కేసుల సంఖ్య మరింత తగ్గేది. అయినా ఇప్పటికీ ఇంకా రాష్ట్రాల వారీగా కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఎత్తేస్తారా.. లేక కొనసాగిస్తారా అన్నదానిపై సహజంగానే ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి..

భారత్‌లో లాక్‌డౌన్‌పై కొన్ని సంస్థలు సర్వే నిర్వహించాయి. దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితి, నమోదవుతున్న కేసుల సంఖ్య, కరోనా రోగులకు అందుతున్న వైద్యంతోపాటు ఇతర అంశాలపై పూర్తిగా రిపోర్టులు తయారు చేశాయి. ఈ సర్వేలన్నీ చెప్తున్న అంశం ఒక్కటే. జూన్‌ 3వ వారం వరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తేనే మంచిదని. ఆ తర్వాతే లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని ఆ రిపోర్టులు సూచిస్తున్నాయి. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు.. జూన్‌ 3వ వారంలో కరోనా భారత్‌లో పీక్‌స్టేజ్‌కు వెళ్తుందని తన రిపోర్ట్‌లో తెలిపింది. కాబట్టి అప్పటి వరకు లాక్‌డౌన్‌ ఎత్తివేయకపోతేనే మంచిదనే  సూచన చేసింది.

జూన్‌ 4వ వారం నుంచి సెప్టెంబర్‌ 2వ వారం మధ్య లాక్‌డౌన్‌ ఎత్తివేసుకోవచ్చని ఆ రిపోర్ట్‌ తెలియజేస్తోంది. వైద్య రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలనే సూచిస్తున్నారు. కేసుల సంఖ్య తగ్గిందని లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే పరిస్థితి చేయి దాటిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన కృషంతా వృధా అని చెప్తున్నారు. అందుకే లాక్‌డౌన్‌ను మరో 28 రోజులు పొడిగిస్తేనే మంచిదని అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ థియరిటికల్‌ ఫిజిక్స్‌ విభాగం పరిశోధకులు చెబుతున్నారు. దేశంలో ఒక్క కేసు ఉన్నా.. మళ్లీ అది ప్రతాపం చూపే అవకాశముంటుందని అంటున్నారు.