నైరుతి రాకతో పులకరించిన పుడమితల్లి

నైరుతి రుతుపవనాలు జూన్ 1 న కేరళలోకి ప్రవేశించంటం తోటే తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిశాయి. తమిళనాడు పుదుచ్చేరిల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి రుతు పవనాలు విస్తరించాయని భారత వాతావరణ విభాగం అధికారులు సోమవారం ధృవీకరించారు. దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులను ఈ రుతు పవనాలు పూర్తిగా కమ్ముకున్నాయి.
మాల్దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోమెరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. కాగా, నైరుతి రుతుపవనాల సీజన్‌లో కురిసే వర్షాలవల్లే దేశంలో 50 శాతంపైగా పంటలు సాగవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు అత్యధిక ప్రాంతాల్లో పంటల సాగుకు నైరుతి రుతుపవనాలే కీలకం కానున్నాయి.
నేడు,రేపు- ఏపీ,తెలంగాణలో వర్షాలు
ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవుల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో.. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, నైరుతి, ఆగ్నేయ రాయలసీమ, తెలంగాణ మీదుగా కొనసాగుతోంది.
ఈ ద్రోణి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో భీమిలిలో 3 సెం.మీ, సాలూరు, వెంకటగిరి కోటలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఈ ఏడాది 102శాతం వర్షపాతం-ఐఎండీ అధికారులు
ఈ ఏడాది జూన్–సెప్టెంబర్ లలో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినట్లు ఐఎండీ అధికారులు సోమవారం ఢిల్లీలోనూ, అమరావతిలోనూ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రాంతాల వారీగా, నెలల వారీగా కూడా దీర్ఘకాలిక వర్షపాత అంచనాలను ఐఎండీ అధికారులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా జూలైలో 103 శాతం, ఆగస్టులో 97 శాతం వర్షపాతం నమోదవుతుంది. ఈ అంచనాలో తొమ్మిది శాతం అటూ ఇటుగా తేడా ఉండవచ్చని తెలిపారు. అలాగే.. దక్షిణాది రాష్ట్రాల్లో 102 శాతం సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు. కాగా, ఈ నెల రెండో వారంలో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
Read: కేరళలో రుతుపవనాలు ఎఫెక్ట్.. తుఫాన్ హెచ్చరికలు.. ఏపీ, తెలంగాణల్లో వర్షాలు