దటీజ్ మోదీ..! ముందు చూపు, తెలివైన అడుగులతో మూడోసారి ప్రధాని పదవి కైవసం

ఇక ఈ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం. 2019 ఎన్నికల నాటికి..

Narendra Modi : రాబోయే పరిస్థితులను గ్రహించడంలోనే ఓ రాజకీయనాయకుడి విజయం దాగి ఉంటుంది. ముందుచూపు ఉంటేనే రాజకీయాల్లో మనుగడ సాధ్యమవుతుంది. అనూహ్య పరిణామాలను అంచనా వేయగలిగి.. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటేనే పరాజయం ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ ప్రధాని మోదీ సరిగ్గా చేయగలిగారు. అందుకే ఆయన నెహ్రూ తర్వాత మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. తిరుగులేని అధికారంలో ఉండి కూడా పొత్తుల విషయంలో, కూటమిని బలోపేతం చేయడంలో ప్రధాని వేసిన తెలివైన అడుగులే.. అధికార పీఠానికి ఇండియా కూటమిని దూరం చేసి ఎన్డీఏను దగ్గర చేశాయి.

2019 ఎన్నికల్లో బీజేపీది తిరుగులేని విజయం. 1984 తర్వాత జాతీయస్థాయిలో ఓ పార్టీ 300కు పైగా స్థానాలు సాధించింది 2019లోనే. ఆ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయానికి ఎన్డీఏలోని మిగిలిన పార్టీల అవసరం బీజేపీకి లేదు. అయినా సరే బీజేపీ మిత్రపక్షాలను విడిచిపెట్టలేదు. అప్పుడే కాదు 2014లోనూ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలను సొంతంగానే సాధించింది. అయినప్పటికీ మిత్రపక్షాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి సముచిత ప్రాధాన్యత ఇచ్చింది. జాతీయస్థాయిలో తిరుగులేని అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ ఎప్పుడూ మిత్రపక్షాలను వదిలి పెట్టలేదు. అవకాశం కుదిరినప్పుడల్లా కూటమి బలోపేతానికే ప్రయత్నించింది. ఈ వ్యూహమే 2024 ఎన్నికల్లో బీజేపీకి లాభించింది.

2024 ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా కనిపించింది. 370 స్థానాలను సొంతంగా, 400 స్థానాలను కూటమిగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ పెట్టుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా సాధిస్తుందన్న అంచనాలూ దేశంలో నెలకొన్నాయి. అయినప్పటికీ కూటమిని బలోపేతం చేసుకోవడంపై ప్రధాని వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అంతకు రెండేళ్ల క్రితం బీజేపీతో విభేదించి బీహార్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లిపోయి…కాంగ్రెస్‌తో కలిసి నడిచి…ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నితీశ్‌కుమార్‌కు గాలం వేసి..‌..సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయన కూటమి ఫిరాయించేలా చేశారు ప్రధాని.

ఈ పరిణామం కాంగ్రెస్‌ను ఎంతగా షాక్‌కు గురిచేసిందో అంతగా..ఇండియా కూటమికి నష్టం కలిగించింది. అదే సమయంలో ఎన్డీఏ కూటమికి లాభించింది. బీహార్‌లో 12 స్థానాలు గెలిచిన జేడీయూ….మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా మారారు. బీహార్‌లో మరో పార్టీ లోక్‌జనశక్తి విషయంలోనూ బీజేపీ ఇలాగే వ్యవహరించింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదికి ముందు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తిని ఎన్డీఏలో చేర్చుకుంది. వ్యవసాయ చట్టాలపై విభేదించి కూటమి నుంచి వెళ్లిపోయిన శిరోమణీ అకాలీదళ్‌ను కూటమిలోకి ఆహ్వానించింది.

ఇక ఈ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం. 2019 ఎన్నికల నాటికి టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు నెలకొన్నాయి. 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీచేశాయి. వైసీపీ, బీజేపీ మధ్య పొత్తు లేనప్పటికీ..రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదరడం ఏపీ రాజకీయాలనే కాదు.. ఇప్పుడు జాతీయస్థాయి రాజకీయాలను కీలక మలుపు తిప్పింది.

టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకండా జాగ్రత్తపడి కూటమిగా ఘనవిజయం సాధించాయి. ఈ పొత్తు ఫలితంగా ఏపీలో బీజేపీ మూడు ఎంపీ స్థానాలు గెలవలగలింది. టీడీపీ, జనసేనతో ముందే పొత్తు పెట్టుకోవడంతో… ఆ రెండు పార్టీలకు కలిపి వచ్చిన 18మంది ఎంపీల సంఖ్య… ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు చేయడంలో కీలకంగా మారింది.

బీజేపీ బలంగా ఉందన్న అహంకారానికి పోకుండా…. పొత్తుల విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా వ్యవహరించిన తీరు…నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి మోదీ దేశ ప్రధాని పదవి చేపట్టేలా చేస్తోంది. టీడీపీ బలాన్ని ముందే అంచనా వేసి…ఆ పార్టీతో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవడం ఎన్డీఏకు అనుకోని వరంలా మారింది. మరో విషయంలోనూ మోదీ వ్యూహాలు ఫలించాయి. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాదిపై గట్టి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే ఈసారి ఉత్తరాదిన బీజేపీకి ఆ స్థాయిలో సీట్లు రాలేదు. కానీ దక్షిణ భారతదేశంపై పూర్తి దృష్టి పెట్టి.. ప్రధాని విస్తృత ప్రచారం నిర్వహించారు.

దీంతో గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య పెంచుకోగలిగింది బీజేపీ. తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో లేనప్పటికీ బీజేపీ మెరుగైన స్థానాలు సాధించగలిగి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఢోకా లేని పరిస్థితిని సృష్టించుకుంది. కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుంది. బీజేపీకి, జేడీఎస్‌కు కలిపి 19 స్థానాలొచ్చాయి. తెలంగాణలో 8 స్థానాలు గెలుచుకుంది. తమిళనాడులో గెలవలేకపోయినప్పటికీ… కేరళలోనూ కమలదళం ఖాతా తెరిచింది. ఇలా దక్షిణాదిన సత్తా చాటడం ద్వారా బీజేపీ బలం పెంచుకోవడంతో పాటు ప్రత్యేక దక్షిణ భారత దేశం ప్రచారాన్నీ తిప్పికొట్టినట్టైంది.

Also Read : ఎన్డీయేలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు..! ఈ గొప్ప అవకాశాన్ని ఎలా ఉయోగించుకుంటారు? ఏపీ కోసం ఏం చేయబోతున్నారు?