ఎన్డీయేలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు..! ఈ గొప్ప అవకాశాన్ని ఎలా ఉయోగించుకుంటారు? ఏపీ కోసం ఏం చేయబోతున్నారు?

కేంద్రంలో వరుసగా మూడోసారి ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా పోలవరం నిర్మాణానికి సహకారంతో పాటు రాష్ట్రానికి ప్రాజెక్టుల కేటాయింపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత వంటివి సాధిస్తే... .ఏపీ ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుకు సరికొత్త అర్ధం చేకూరుతుంది.

ఎన్డీయేలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు..! ఈ గొప్ప అవకాశాన్ని ఎలా ఉయోగించుకుంటారు? ఏపీ కోసం ఏం చేయబోతున్నారు?

Chandrababu King Maker : కేంద్రంలో ఎన్డీయే సర్కార్ మూడోసారి ఏర్పాటు చేయడంలో తెలుగు రాష్ట్రాలది కీలక పాత్రగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోనూ, NDAలోనూ భాగస్వాములుగా ఉండగా, తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలున్నారు. పదేళ్ల తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఇంతమంది ఉండడం ఇదే తొలిసారి. మరి ఈ అమూల్య అవకాశాన్ని మన నాయకులు ఎలా ఉయోగించుకుంటారు అన్నదానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

రాష్ట్ర విభజన తర్వాత సంధి దశలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు… కేంద్రం నుంచి అనేక సహాయసహకారాలు అందాల్సి ఉంది. వాటిని తెచ్చుకోగల అద్భుత అవకాశాన్ని టీడీపీకి కల్పించారు ఏపీ ఓటర్లు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని వరాన్ని అందించారు. ఎన్డీఏకు కీలకంగా మారిన చంద్రబాబు…. ఏపీ కోసం ఏం చేయబోతున్నారనేదే…రానున్న రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించనుంది.

రాష్ట్రం విడిపోయాక తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు అద్భుత అవకాశం..
సమయం వచ్చింది మిత్రమా.. ఆంధ్రప్రదేశ్‌ గురించి ఇప్పుడీ మాట కచ్చితంగా అనుకోవాలి. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు అద్భుత అవకాశం దక్కింది. ఎన్నికల్లో ఊహించని విజయం కట్టబెట్టడం ద్వారా టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకూ ఏపీ ఓటర్లు ఆ అవకాశమిచ్చారు. విభజన తర్వాత రాజధాని, అభివృద్ధి, ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా ఇతర అంశాల పరంగా… ఆంధ్రప్రదేశ్ సంధి దశలో ఉంది. ఏపీకి కావల్సినవాటన్నింటినీ డిమాండ్ చేసి నేరవేర్చుకోగల స్థితిలో రాజకీయంగా ఏపీ ఉంది.

టీడీపీకి 16, బీజేపీకి 3, జనసేనకు రెండు ఎంపీ స్థానాలను ఏపీ ఓటర్లు అందించడంతో రాష్ట్ర చరిత్రను మేలిమలుపు తిరిగేదిశగా అడుగులు మొదలయ్యాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ 21 మంది ఎంపీలు కేంద్రంలో NDA ప్రభుత్వానికి ఆయువు పట్టులాంటి వారు. NDA కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ అవసరంగా ఉపయోగపడే తెలుగు ఎంపీలపై రాష్ట్ర తక్షణ అవసరాలను తీర్చాలిన బాధ్యత ఉంది.

చంద్రబాబు అద్భుతాలు సృష్టిస్తారా?
ఏపీలో ఈసారి టీడీపీకి దక్కిన గెలుపు అనూహ్యమైనది. ఈ ఘనవిజయం ఏపీలో పాలన అందించడానికే కాదు… కేంద్రంలో చక్రం తిప్పడానికీ ఆ పార్టీ అధినేతకు అవకాశం కల్పించింది. ఈ అవకాశంతో చంద్రబాబు అద్భుతాలు సృష్టిస్తారా లేదా అన్నదానిపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందన్నది అందరూ అంగీకరించే నిజం. బాధాకరమైన విషయమేంటంటే…విభజన తర్వాత ఆ అన్యాయాన్ని తగ్గించే దిశగా అడుగులు పడకపోవడం.

మిత్రపక్షాలతో పని లేకుండా పోయింది…
విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపినప్పటికీ…బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత..ఆ హామీని అమలు చేయలేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి సహకారం అందించలేదు. 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినన్ని సీట్లు సాధించింది. మిత్రపక్షాలతో పని లేకుండా పోయింది. దీంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలు సాధించే స్థాయి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి లేకుండా పోయింది. కేంద్రం ఇచ్చిందే తీసుకోవాల్సిన స్థితిలో ఉండిపోయింది. ఈ ప్రభావంతో ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం వంటివాటిపై తీవ్ర ప్రభావం పడింది.

వైసీపీకి 22మంది ఎంపీలున్నా సమస్యలు పరిష్కారం కాలేదు..
2019 నాటి ఎన్నికల తర్వాత పరిస్థితి మరోలా మారింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయం దక్కింది. ఆ పార్టీకి 22 ఎంపీ స్థానాలు లభించాయి. కానీ జాతీయస్థాయిలో బీజేపీ ఘనవిజయం సాధించింది. అప్పుడు బీజేపీ సొంతంగా 303 స్థానాలు దక్కించుకుంది. దీంతో మిగిలిన ఏ పార్టీ ఎంపీల మద్దతూ బీజేపీకి అవసరం లేకపోయింది. దీంతో 22 మంది ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండిపోయింది. ఫలితంగా విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా ప్రత్యేక హోదా దక్కలేదు. విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. జాతీయహోదా కట్టబెట్టిన పోలవరం నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ఏపీ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడింది.

ఆంధ్రప్రదేశ్‌కు అన్నీ సాధించేందుకు టీడీపీకి అవకాశమొచ్చింది..
కానీ 2024 ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అన్నీ సాధించేందుకు టీడీపీకి అవకాశమొచ్చింది. ఏపీ ఓటర్లు టీడీపీకి 16 స్థానాలివ్వడం ద్వారా ఆ అవకాశం కల్పిస్తే…. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ ఇవ్వకుండా జాతీయస్థాయిలో ఓటర్లు….. చంద్రబాబుకు మేలు చేశారు. 16 మంది ఎంపీలున్న చంద్రబాబు..ఎన్డీఏ 3 ఏర్పాటులో కీలకంగా మారారు. ఎన్డీఏకు మద్దతివ్వడానికి టీడీపీ ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు కీలక మంత్రిత్వశాఖలు అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక హోదా వస్తే ఏపీ రూపురేఖలు మారిపోనున్నాయి. పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఆసక్తి చూపలేదు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందా?
మరిప్పుడు చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి…కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. టీడీపీకి 16 సీట్లు ఇవ్వడంతో పాటు జనసేనకు రెండు, బీజేపీకి మూడు స్థానాలు ఇచ్చారు ఏపీ ఓటర్లు. అంటే ఏపీ నుంచి 21 మంది ఎంపీలను ఇచ్చి..ఎన్డీఏకు అండగా నిలిచారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా పోలవరం నిర్మాణానికి సహకారంతో పాటు రాష్ట్రానికి ప్రాజెక్టుల కేటాయింపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత వంటివి సాధిస్తే… ఏపీ ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుకు సరికొత్త అర్ధం చేకూరుతుంది.

Also Read : చంద్రబాబు క్యాబినెట్‌లో ఉండేదెవరు? పవన్, లోకేశ్‌లకు దక్కే మినిస్ట్రీ ఏది? జిల్లాల వారీగా వివరాలు..