ప్లీజ్.. ఎక్కువమంది పిల్లలను కనండి..! చంద్రబాబు, స్టాలిన్, ఎలాన్ మస్క్ పిలుపు వెనుక ఆంతర్యం ఏంటి?

పిల్లలను కనండి ప్లీజ్ అని చంద్రబాబు అంటుంటే.. మనం, మనకు 16 మంది అని స్టాలిన్ పిలుపునిస్తున్నారు.

More Children : ఒకరు వద్దు ముగ్గురు ముద్దు.. పిల్లలను కనండి ప్లీజ్.. ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పదే పదే అంటున్న మాట. ఎక్కువమంది పిల్లలను కనాల్సిందేనని ఏపీలో చట్టం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే.. 16 మంది పిల్లలను కంటే తప్పేంటి అని స్టాలిన్ అంటున్నారు. ఈ ఇద్దరు ఎందుకిలా మాట్లాడుతున్నారు? వారి మాటలకు అర్థమేంటి? అసలు ఆ మాటలకు అర్థం ఉందా?

పిల్లలను కనండి ప్లీజ్ అని చంద్రబాబు అంటుంటే.. మనం, మనకు 16 మంది అని స్టాలిన్ పిలుపునిస్తున్నారు. పిల్లలను కంటేనే మనం బాగుంటాం. దేశం బాగుంటుందని పిలుపునిస్తున్నారు. ఏపీ సర్కార్ ఒక అడుగు ముందుకేసి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారిని స్థానిక సంస్థల్లో పోటీ చేసేలా చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇద్దరు ముఖ్యమంత్రుల మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరతీశాయి.

ఏపీలో వృద్ధుల జనాభా పెరుగుతోంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే భవిష్యత్తులో పని చేసేందుకు మానవ వనరులు తగ్గే ప్రమాదం ఉంది. రాష్ట్రం కోసం విజన్ 2047 అంటున్న చంద్రబాబు.. పిల్లలను కనాల్సిందేనని పిలుపునిస్తున్నారు. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుదల కారణంగా పార్లమెంట్ సీట్లు కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఇలా జరగొద్దు అంటూ కొత్త దంపతులు 16 మంది పిల్లలను ఎందుకు కనకూడదని నవ్వుతూ ఓ మాట అనేశారు స్టాలిన్.

నిజానికి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండగా, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం బాగా తగ్గింది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను దక్షిణాది రాష్ట్రాల్లో స్ట్రాంగ్ గా అమలు చేయడమే దీనికి కారణం.

రాష్ట్రాల ప్రయోజనాలు, లోక్ సభ స్థానాల గురించి ఆలోచించి పిల్లలను కనండని చంద్రబాబు, స్టాలిన్ అని ఉండొచ్చు. అదే వేరే సంగతి. మరి ప్రపంచ కుబేరుడు మస్క్ కూడా ఇదే మాట ఎందుకు అంటున్నారు? పెంపకం ఖర్చు ఆలోచించొద్దు, పిల్లలను కనండి అని ఎందుకు చెబుతున్నారు? పిల్లలను కంటే ప్రోత్సాహకాలు అని చాలా దేశాలు ఎందుకు అంటున్నాయి? అసలేం జరుగుతోంది?

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పిల్లలను కనేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో సంతానోత్పత్తి రేటు భారీగా పడిపోతోంది. ఈ జనాభా నియంత్రణ కారణంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా పాపులేషన్ కంట్రోల్ పై ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల పెంపకంతో అయ్యే ఖర్చుల గురించి జనాలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని, అలాంటి ఆలోచనలు మానేసి పిల్లలను కనడంపై దృష్టి పెట్టాలని సూచించారు మస్క్. పిల్లలను కనండి, కుటుంబాన్ని పెంచుకోండి అంటూ పిలుపునిచ్చారు. డబ్బు గురించి మరిచిపోండి, త్వరగా పెళ్లి చేసుకోండి, ఎక్కువ మంది పిల్లలను కనండని సూచించారు.

 

Also Read : త్రిశూల వ్యూహం అమలు చేస్తున్న ఇజ్రాయెల్..! అసలేంటి వ్యూహం? హమాస్, హెజ్బొల్లాను ఎలా దెబ్బకొట్టనుంది?