Supreme Court
Supreme Court: అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఏమిటి ఏదన్నా మంచి ముహూర్తంకోసం చూస్తున్నారా? అంటూ ప్రశ్నించింది. వారిని రెండు వారాల్లోగా పంపించేయాలి.. ఆ తరువాత కోర్టుకు నివేదిక సమర్పించాలి అంటూ సీరియస్ గా కోర్టు ఆదేశాలిచ్చింది. ఇంతకీ అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ కు కారణం ఏమిటంటే.. అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను ఇంకా బయటకు పంపించకపోవటమే. అస్సాంలోని నిర్బంధ కేంద్రాల్లో సుదీర్ఘకాలంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరులను వారి స్వదేశానికి పంపించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Also Read: ఆస్తి కోసం వదిన ఎంత పనిచేసింది.. పోలీసుల దెబ్బకు కథ మొత్తం చెప్పేసింది..
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం పిటిషన్ పై విచారణ జరిపింది. రాజ్యాంగం 21 ప్రకారం వారిని శాశ్వతంగా నిర్భంధ కేంద్రాల్లో ఉంచలేమని పేర్కొంది. ఎన్ఆర్సీ సందర్భంగా గుర్తించిన 63 మంది విదేశీయులను ఇంకా నిర్భంధ కేంద్రాల్లో ఎందుకు నిరవధికంగా ఉంచారని ప్రశ్నించిన కోర్టు.. వారిని రెండు వారాల్లోగా వారి దేశాలకు పంపించాలని ఆదేశించింది. అయితే, చిరునామాలు లభ్యం కాలేదని, అందుకే పంపలేక పోయామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరణ ఇవ్వగా.. న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. అది తమకు సంబంధం లేని విషయం.. బంగ్లాదేశ్ పౌరులను వారి సొంత దేశానికి పంపించాల్సిందే. చిరునామా తెలియకపోయినా వెనక్కి పంపించవచ్చు అంటూ కోర్టు పేర్కొంది.
Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. గాజాను స్వాధీనం చేసుకుంటామని వెల్లడి
అస్సాంలో చాలా నిర్భంధ కేంద్రాలు ఉన్నాయి.. ఇంత వరకు ఎంత మందిని దేశ బహిష్కారం చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, ఇది రాష్ట్రానిది కాదు.. కేంద్రానికి సంబంధించిన విషయం. కేంద్రం దౌత్యమార్గంలో ఈ సమస్యను పరిష్కరించాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దీనిపై సంబంధిత వ్యక్తులతో చర్చిస్తామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జాతీయత తెలియని వారి విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించాలనుకుంటున్నారు.. తదితర వివరాలతో కేంద్రం నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసును ఫిబ్రవరి 25వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.