Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. గాజాను స్వాధీనం చేసుకుంటామని వెల్లడి
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బుధవారం శ్వేతసౌదంలో డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది.

Donald Trump
‘Donald Trump On Gaza: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందునుంచి తాను చెబుతున్నట్లుగానే.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత పలు దేశాలపై సుంకాలు విధింపుతోపాటు.. అమెరికాలో అక్రమ వలసదారులను గుర్తించి వారి దేశాలకు ప్రత్యేక విమానాల ద్వారా పంపించేస్తున్నారు. మరోవైపు గతంలో గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపైనా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ గాజాను ఉద్దేశిస్తూ సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. అయితే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తో భేటీ అనంతరం ప్రధాని ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: China: అమెరికాపై ప్రతీకార చర్యకు దిగిన చైనా.. కెనడా, మెక్సికోలకు ట్రంప్ బిగ్ రిలీఫ్.. ఎందుకంటే?
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బుధవారం శ్వేతసౌదంలో డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అయితే, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ కావడం ఇది రెండోసారి. తాజాగా వీరి భేటీ అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ గాజాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘గాజా స్ట్రీప్ ను స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేయాలని అమెరికా భావిస్తుంది. యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న పాలస్తీనా భూభాగం గాజా స్ట్రీప్ ను అమెరికా ఆక్రమించుకొని అభివృద్ధి చేస్తుంది. పూర్తిగా అది అమెరికా ఆధీనంలో ఉంటుంది. ప్రమాదకరమైన అన్ని ఆయుధాలను నాశనం చేసే బాధ్యతను తీసుకుంటాం. ఆ ప్రాంతంలో ధ్వంసమైన భవనాల శిథిలాలను అమెరికా తొలగిస్తుంది. ఆ తరువాత అక్కడి ప్రజలు ఆర్థికాభివృద్ధికి అమెరికా కృషి చేస్తుంది’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు.
Also Read: వారిని ఇండియాకు పంపించేస్తున్న ట్రంప్.. ఎంతమంది భారతీయులపై ప్రభావం పడుతుందో తెలుసా?
గాజా స్ట్రీప్ ను స్వాధీనం చేసుకున్న తరువాత అక్కడి ప్రజలకు ఎలాంటి పునరావాసం కల్పిస్తారు. అమెరికా ఆ ప్రాంతాన్ని ఎలా పరిపాలిస్తుంది.. పాలస్తీనా ప్రజల పునరావాసం కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించబోతుంది అనే విషయాలపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా స్ట్రీప్ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ ప్రణాళిక చాలా సున్నితమైన, సంక్లిష్టమైన సమస్య కావడంతో దీనిపై అంతర్జాతీయంగా ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, గాజా స్ట్రీప్ లో భద్రతా పరిస్థితిని బలోపేతం చేయడానికి అమెరికా దళాలను పంపిస్తారా అని ప్రశ్నించగా.. ‘‘మేము అవసరమైంది చేస్తాం. అవసరమైతే అలాకూడా చేస్తాం’’ అంటూ ట్రంప్ సమాధానం ఇచ్చారు.
#WATCH | US President Donald Trump says, “…The US will take over the Gaza Strip and we will do a job with it. We’ll own it and be responsible for dismantling all of the dangerous unexploded bombs and other weapons on the site and getting rid of the destroyed buildings. Create… pic.twitter.com/Kx32qyXRnJ
— ANI (@ANI) February 5, 2025
గాజా స్ట్రీప్ పై డొనాల్డ్ ట్రంప్ ప్రకటన తరువాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. ట్రంప్ ఆలోచన గాజా స్ట్రీప్ చరిత్రను మార్చగలదని అన్నారు. గాజాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి భిన్నంగా అక్కడ భవిష్యత్తును ట్రంప్ ఊహించారని నెతన్యాహు పేర్కొన్నారు.
ట్రంప్ ప్రకటనపై హమాస్ సీనియర్ నేత సమీ అబుజుహ్రీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రాంతంలో గందరగోళం, ఉద్రిక్తతలను సృష్టించడానికి ఇదొక ప్రయత్నమని అన్నారు.