China: అమెరికాపై ప్రతీకార చర్యకు దిగిన చైనా.. కెనడా, మెక్సికోలకు ట్రంప్ బిగ్ రిలీఫ్.. ఎందుకంటే?
అమెరికాపై ప్రతీకార చర్యలకు చైనా దిగింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, గ్యాస్ లపై 15శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఆ దేశం పేర్కొంది.

china president xi jinping
China President xi jinping: అమెరికాకు చైనా బిగ్ షాకిచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఇతర దేశాల నుంచి దిగుమతులపై సుంకాలను అమాంతం పెంచేస్తున్నాడు. మెక్సికో, కెనడా, చైనా దిగుమతులపై సుంకాలను పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. కెనడా, మెక్సికో దిగుమతులుపై 25శాతం సుంకాన్ని విధించిన ట్రంప్.. చైనా దిగుమతులపై 10శాతం సుంకం విధించే ఆర్డర్లపై సంతకం చేశారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన యుద్ధానికి తొలుత గట్టి ప్రతిస్పందన ఎదురైంది. కెనడా అమెరికాకు గట్టి షాకిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు కెనడా తెలిపింది. మెక్సికోసైతం తొలుత కెనడా బాటలోనే పయణించేందుకు సిద్ధమైంది. అయితే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ డోనాల్డ్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడిన తరువాత ట్రంప్ కాస్త శాంతించాడు. నెలరోజులు సుంకాల విధింపు నుంచి ఆ రెండు దేశాలకు ఉపశమనం కల్పించారు. అయితే, తాజాగా అమెరికాకు చైనా షాకిచ్చింది.
అమెరికాకు షాకిచ్చిన చైనా..
చైనా దిగుమతులపై 10శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవటంతో ఆ దేశం తీవ్రంగా స్పందించింది. ‘‘ట్రంప్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అమెరికా తప్పుడు పద్దతిని ఉపయోగిస్తోంది.. మా ప్రయోజనాలను కాపాడుకోవటానికి మేము కట్టుబడి ఉన్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది’’. అయితే, తాజాగా.. అమెరికాపై ప్రతీకార చర్యలకు చైనా దిగింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, గ్యాస్ లపై 15శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఆ దేశం పేర్కొంది.
మెక్సికో, కెనడాకు కాస్త ఉపశమనం..
సుంకాల విధింపులో మెక్సికో, కెనడా విషయంలో డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కు తగ్గారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్, ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మెక్సికో నుంచి అమెరికాకు మాదకద్రవ్యాలు, ఫెంటానిల్ అక్రమ రవాణా, అక్రమ వలసలను కట్టడి చేసేందుకు 10వేల మంది సైనికులకు సరిహద్దుకు తరలిస్తామని షీన్ బామ్ హామీ ఇవ్వడంతో ట్రంప్ సుంకాల విధింపును నెలరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా కెనడాకు సుంకాల విధింపులో ట్రంప్ కాస్త ఉపశమనం కల్పించారు. ఈ విషయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జరిపిన సంభాషణలో ‘‘సరిహద్దు రక్షణ కోసం 10వేల మంది బలగాలు పంపిస్తాం. దీంతోపాటు ఫెంటనిల్ జార్ ను నియమించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. మేము కలిసి పనిచేసే వరకు ప్రతిపాదించిన టారిఫ్ లు కనీసం 30రోజుల పాటు నిలిపివేసేందుకు అంగీకారం కుదిరింది’’ అని ట్రూడో పేర్కొన్నాడు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
I just had a good call with President Trump. Canada is implementing our $1.3 billion border plan — reinforcing the border with new choppers, technology and personnel, enhanced coordination with our American partners, and increased resources to stop the flow of fentanyl. Nearly…
— Justin Trudeau (@JustinTrudeau) February 3, 2025
ట్రంప్ వ్యూహం ఫలించిందా ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధానికి తెరలేపడానికి కారణం.. ఆ దేశాలను లొంగదీసుకోవటానికేనన్న వాదన ఉంది. మెక్సికో సరిహద్దులో పదివేల మంది సైనికులను మోహరించాలనే తన డిమాండ్ ను మెక్సికో అంగీకరించేలా ట్రంప్ చేశారని నిపుణులు భావిస్తున్నారు. కెనడా ద్వారా యూఎస్ లోకి ఫెంటానిల్ అమ్మకాలను నిరోధించడానికి ఫెంటానిల్ జార్ నియామకం ఒక అవసరం. ఆ మేరకు కెనడాసైతం అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో ఆ రెండు దేశాలకు ప్రతిపాదిత సుంకాల అమలుపై ట్రంప్ నెలరోజులు విరామం ఇచ్చాడు. ప్రస్తుతం చైనా వంతు.. ట్రంప్ చైనాపై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చైనా ప్రస్తుతానికి ఎదురుదాడికి దిగినప్పటికీ రాబోయే కాలంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.