అయోధ్యలో మందిర నిర్మాణానికి లైన్ క్లియర్..రివ్యూ పిటిషన్లు కొట్టేసిన సుప్రీం

  • Published By: venkaiahnaidu ,Published On : December 12, 2019 / 12:09 PM IST
అయోధ్యలో మందిర నిర్మాణానికి లైన్ క్లియర్..రివ్యూ పిటిషన్లు కొట్టేసిన సుప్రీం

Updated On : December 12, 2019 / 12:09 PM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. గత నెలలో అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుని రివ్యూ చేయాలని కోరుతూ ఇప్పటివరకు దాఖలైన 18 పిటిషన్లను గురువారం (డిసెంబర్-12,2019) సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆల్ ఇండియా ముస్లిం పర్శనల్ లా బోర్డు,నిర్మోహి అఖారా తదితరులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను ఇవాల చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది.

నవంబర్-9,2019న ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉన్నట్లు సుప్రీం తేల్చిచెప్పింది.2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి వీలుగా రామ్ లల్లాకు కేటాయించాలని నవంబర్ 9న సుప్రీం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే ఐదెకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని తీర్పు సందర్బంగా కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది.

అయితే అయోధ్య తీర్పును సమీక్షించాలంటూ.. డిసెంబర్ 2న సుప్రీంలో తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమయత్ ఉలామా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత మరికొన్ని పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయోధ్య తీర్పును సమీక్షించాలని వీరంతా కోరారు.

బాబ్రీ మసీదు పునఃనిర్మాణానికి ఆదేశిస్తేనే పూర్తి న్యాయం జరుగుతుందని పిటిషనర్ మౌలానా సయ్యద్ అషాద్ రషీద్ న్యాయస్థానానికి తెలిపారు. అయోధ్యపై ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలన్నారు. అయోధ్య తీర్పుపై అఖిల భారత హిందూ మహాసభ పరిమిత రివ్యూను కోరింది. అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించడాన్ని హిందూ మహాసభ ఖండించింది.