లైంగిక నేరాలపై సుప్రీంకోర్టు సీరియస్: రాష్ట్రాలకు ఆదేశాలు.. హైకోర్టుకు సూచనలు

  • Published By: vamsi ,Published On : December 19, 2019 / 02:14 AM IST
లైంగిక నేరాలపై సుప్రీంకోర్టు సీరియస్: రాష్ట్రాలకు ఆదేశాలు.. హైకోర్టుకు సూచనలు

Updated On : December 19, 2019 / 2:14 AM IST

దేశవ్యాప్తంగా అత్యాచార నేరాలు పెరిగిపోయాయి. దేశంలో అఘాయిత్యాలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తంచేసింది సుప్రీం కోర్టు. లైంగిక నేరాల విషయంలో న్యాయం అందుతున్న తీరును అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. అలాంటి కేసుల్లో విచారణ, సాక్ష్యాల సేకరణ, ఫోరెన్సిక్‌, మెడికల్‌ సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలం, విచారణకు పట్టిన సమయం తదితర వివరాలను సమర్పించాలంటూ రాష్ట్రాలకు, హైకోర్టులకు సూచనలు చేసింది సుప్రీం కోర్టు.

ఇటీవల దిశ హత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలపై సరైన న్యాయం జరగట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు. ఈ క్రమంలోనే 2020 ఫిబ్రవరి 7లోగా సంబంధిత నివేదికను సమర్పించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్రాలకు, హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ బెంచ్‌లో బొబ్డేతో పాటు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ కూడా ఉన్నారు. 2012లో జరిగిన నిర్భయ ఘటనలో ఇప్పటివరకు దోషులకు ఉరిశిక్ష విధించకపోవడంపై ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. న్యాయం జరగడంలో తీవ్రమైన జాప్యం కారణంగా న్యాయస్థానాలపై ప్రజలలో అపనమ్మకాలు ఏర్పడుతున్నాయి.