Suresh Pachouri, Gajendra Singh Rajukhedi Joins BJP
Jolt To Congress in Madhya Pradesh: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు తాజాగా గట్టి షాక్ తగిలింది. గాంధీ ఫ్యామిలీకి విధేయుడిగా మెలిగిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సురేష్ పచౌరీతో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సురేష్ పచౌరీతో పాటు, మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ రాజుఖేడి, మాజీ ఎమ్మెల్యేలు సంజయ్ శుక్లా, అర్జున్ పాలియా, విశాల్ పటేల్.. బీజేపీలో చేరిపోయారు.
శనివారం ఉదయం భోపాల్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో వీరంతా కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువాలతో వీరిని సాదరంగా బీజేపీ అగ్ర నేతలు స్వాగతించారు.
గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన పచౌరీ, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగుసార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గానూ పనిచేశారు. ప్రముఖ గిరిజన నాయకుడైన గజేంద్ర సింగ్ రాజుఖేడి.. మూడు పర్యాయాలు కాంగ్రెస్ టిక్కెట్‌పై ధర్ (షెడ్యూల్డ్ తెగలు) లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు 1990లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
Also Read: సీట్ల సర్దుబాటుపై ముగిసిన చర్చలు.. బీజేపీ, జనసేన పార్టీలు పోటీచేసే ఎంపీ స్థానాలు ఇవే!?