కాపుల కోటా మాటేమిటి : OC రిజర్వేషన్లకు TDP మద్దతు

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 11:35 AM IST
కాపుల కోటా మాటేమిటి : OC రిజర్వేషన్లకు TDP మద్దతు

Updated On : January 9, 2019 / 11:35 AM IST

OC రిజర్వేషన్ల బిల్లుకి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ల కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లుని టీడీపీ సమర్థించింది. అయితే కీలకమైన బిల్లుని బీజేపీ తీసుకొచ్చిన తీరు బాగోలేదని రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. హడావుడిగా బిల్లుని తీసుకొచ్చారని మండిపడ్డారు. కీలకమైన బిల్లు కావడంతో తెలుగుదేశం పార్టీ బేషరతుగా మద్దతిస్తోందన్నారు. కాపుల రిజర్వేషన్ల బిల్లుని కేంద్రానికి పంపినా పట్టించుకోకపోవడం దారుణం అని ఆయన అన్నారు. ఈబీసీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో సుజనా చౌదరి పాల్గొన్నారు.

రాజ్యసభలో ఈబీసీ బిల్లుపై చర్చలో పాల్గొన్న ఎంపీ టీజీ వెంకటేష్.. బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లను ఏపీ ఏర్పాటు చేసిందని చెప్పారు. అగ్రవర్ణాల్లోని పేదలకు చంద్రబాబు న్యాయం చేశారని తెలిపారు. ఇలాంటి కార్పొరేషన్లను కేంద్రం కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్లపై తమ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. అయినా ఈబీసీ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని టీజీ వెంకటేశ్ తెలిపారు.

అగ్రకులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 124వ రాజ్యాంగ సవరణ బిల్లుని తీసుకొచ్చింది. ఇప్పటికే లోక్‌సభలో ఈబీసీ బిల్లు పాస్ అయ్యింది. రాజ్యసభలోనూ పాస్ అయితే బిల్లు చట్టంగా మారనుంది. తొలిసారిగా అగ్రకులాల్లో ఆర్థికంగా వెనకబడినవారు రిజర్వేషన్లు పొందుతారు.