జై జవాన్ : ప్రసవ వేదనతో గర్భిణి.. 6 కిలోమీటర్లు మోసుకెళ్లిన జవాన్లు!

  • Publish Date - January 21, 2020 / 12:56 PM IST

అదంతా అడవి.. అక్కడ ఎలాంటి వాహన సౌకర్యాలు ఉండవు.. ఆరోగ్య సమస్యలు వస్తే ఆస్పత్రికి వెళ్లాలంటే 6 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురువుతుందో తెలియక అక్కడి ప్రజలు ఆందోళనగా కనిపిస్తుంటారు.

ఓ రోజున నిండు గర్భిణి ప్రసవ వేదనతో అల్లాడిపోతోంది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ లేక వైద్య సాయం కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో మేం ఉన్నామంటూ అక్కడికి వచ్చారు మన జవాన్లు.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF).. ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ముందుకొచ్చారు. 

మంచం మీద గర్భిణిని కూర్చొబెట్టి కర్రల సాయంతో ఆమెను 6 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ మోసుకెళ్లారు. ఈ ఘటన బీజ్ పూర్ జిల్లాలోని పడేటా అనే అటవీ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది.

ఆస్పత్రికి తీసుకెళ్లిన జవాన్లు ఆమెకు సకాలంలో వైద్య సాయం అందేలా చూశారు. గర్భిణి ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను రక్షించిన జవాన్లకు అందరూ జైజవాన్ అంటూ సలాం కొడుతున్నారు. దీనికి సంబంధించి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.