మొన్న హ్యాకింగ్.. నిన్న స్లీపర్ సెల్స్ అరెస్ట్.. ఇవాళ ఢిల్లీలో కారు పేలుడు.. ఇదంతా ఉగ్రవాదుల పనేనా?
ఆపరేషన్ సిందూర్‌ను ఎవరూ మరవకముందే ఇటువంటి పేలుడు సంభవించడం గమనార్హం.
Delhi Blasts: ఇటీవలే పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న ట్రాన్స్‌పరెంట్ ట్రైబ్ అనే హ్యాకర్ టీమ్ భారత్ ప్రభుత్వ, సైనిక నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అంతేగాక, దేశంలోని పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పేలుడు సామగ్రి, ఆయుధాలతో కొందరు పట్టుబడ్డారు.
వారిలో నలుగురు డాక్టర్లు కూడా ఉన్నారు. ఇవాళ ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఢిల్లీ పేలుడు ఉగ్రవాదుల పనేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
సైబర్ దాడులు
ఇటీవల హోం అఫైర్స్ మంత్రిత్వ శాఖకు ఈ సైబర్ దాడిపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక ఇచ్చింది. ఆ సైబర్ టీమ్ తమ వ్యూహాలను మార్చి, గూగుల్ డ్రైవ్ వంటి పబ్లిక్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లను వదిలి, ప్రైవేట్ సర్వర్లను ఉపయోగించడం ప్రారంభించిందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది. దీంతో వాటిని గుర్తించడం, నిరోధించడం మరింత కష్టమైందని చెప్పింది.
లడఖ్ సరిహద్దు ఉద్రిక్తతలను ఉపయోగించి, చైనా సైనిక కదలికలకు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ను భారత సిస్టమ్‌ల ద్వారా దొంగిలించడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది.
ఏజెన్సీలు తెలిపిన వివరాల ప్రకారం, హ్యాకర్లు ప్రభుత్వ నోటీసులు, జిప్ ఫైళ్లు, ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌ల రూపంలో కనిపించే ఫిషింగ్ ఈ-మెయిల్‌లు పంపుతున్నారు. అధికారులు వాటిని తెరవగానే ఫైళ్లు డౌన్‌లోడ్ అవుతాయి.
ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా ఉపయోగించే బాస్ లినక్స్ సిస్టమ్‌లకు అనుకూలంగా రూపొందించిన డెస్క్‌రాట్ స్పైవేర్ (రహస్య సమాచారాన్ని సేకరించే సాఫ్ట్‌వేర్) గోప్యంగా ఫైళ్లను పర్యవేక్షించి, సేకరించి, ఉగ్రవాదులను డేటా పంపుతుంది. ఈ తాజా దాడులు వేగంగా, మరింత గోప్యంగా జరుగుతున్నాయి.
హ్యాకర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సాయంతో వేగంగా కొత్త మాల్వేర్ రూపాలను తయారు చేస్తున్నారు. ఈ వేగానికి సాధారణ సైబర్ భద్రతా రక్షణలు తట్టుకోలేవని నిపుణులు హెచ్చరించారు.
నలుగురు వైద్యులు అరెస్ట్
తాజాగా వైట్‌కాలర్ నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించిన విషయం తెలిసిందే. ఉగ్రచర్యలతో సంబంధం ఉన్న నలుగురు వైద్యులతో పాటు మరికొందరు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, జమ్మూకశ్మీర్‌లో దాడులు జరిపి 2,500కిలోలకుపైగా పదార్థాలు, రైఫిల్స్, పిస్టల్స్, ఇతర అనుమానాస్పద వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్‌లో మరో డాక్టర్‌ను అరెస్టు చేశారు. అరెస్టైన ఈ నలుగురు వైద్యులకు ఐసిస్, జైషే మహ్మద్, అన్సార్ ఘజ్వతుల్ హింద్ వంటి నిషేధిత సంస్థలతో వారికి సంబంధం ఉందని వెల్లడైంది.
ఇప్పుడు ఢిల్లీలో పేలుళ్లు
మొన్న హ్యాకింగ్.. నిన్న స్లీపర్ సెల్స్ అరెస్ట్.. ఇవాళ ఢిల్లీలో కారు పేలుడు జరగడంతో ఇదంతా ఉగ్రవాదుల పనేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అన్ని నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్‌ను ఎవరూ మరవకముందే ఇటువంటి పేలుడు సంభవించడం గమనార్హం. ఉగ్రవాద చర్యగా తేలితే భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
