తమిళనాడులోనూ నిరసనలే :  బీజేపీ నాయకురాలిపై దాడి

  • Publish Date - February 10, 2019 / 11:32 AM IST

చెన్నై : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు నిరసనలు తెలిపినా,  మొత్తానికి ప్రశాంతంగా గుంటూరు పర్యటన ముగించుకుని తమిళనాడులోని తిరుప్పూర్ వెళ్ళారు. తిరుప్పూర్ లో కూడా మోడీ పర్యటనకు వ్యతిరేకంగా ఎండిఎంకె కార్యకర్తల నిరసన తెలిపారు.  నిరసనలో బీజేపీ మహిళా కార్యకర్త శశికళపై ఎండిఎంకె కార్యకర్తల విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన శశికళను ఆస్పత్రికి తరలించి, ఎండిఎంకె కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ తిరుపూర్ లో మోడి పర్యటన జరుగుతోంది.  

గుంటూరు నుంచి తిరుప్పూరు చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ కొన్ని అభివృధ్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు. తిరుప్పూర్ లో మెట్రో రైలును కూడా ప్రారంభించి, బహిరంగ సభకు వెళ్తున్న సమయంలో విపక్ష డీఎంకే, వైగో నేతృత్వంలోని ఎండీఎంకే  కార్యకర్తలు మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అదే ప్రాంతంలో ఉన్న బీజేపీ మహిళా కార్యకర్తలు, కొందరు నాయకులు పోటా పోటీగా మోడీ కి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. దీంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో  డీఎంకే,ఎండీఎంకే కార్యకర్తలు  శశికళ అనే  బీజేపీ మహిళా నాయకురాలిపై  దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. శశికళపై దాడి చేసిన డీఎంకే,ఎండీఎంకే కార్యకర్తలను పోలీసులువెంటనే అదుపులోకి తీసుకున్నారు. 

తమిళనాడు అంతటా మోడీ పర్యటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గడచిన 2ఏళ్ళుగా డీఎంకే నేతలు మోడీ కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు.  రాజకీయ కారణాలతోనే మోడీ తమిళనాడుకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కర్ణాటకకు మద్దతు తెలపుతూ తమిళనాడును చిన్న చూపు చూస్తున్నారని, చెన్నైలో వచ్చిన వరదలకు కూడా సాయం అంతంత మాత్రంగానే అందించారనేది డీఎంకే  వాదన.  కేంద్ర తమిళనాడుకు ఇప్పటికీ పూర్తిసాయం అందించ లేదని, కావేరి ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో కూడా మోడీ నిర్లక్ష్యం వహించారని డీఎంకే ఎండీఎంకే ఆరోపిస్తున్నాయి.  పార్లమెంట్ లోనూ తమ గోడు మోడీ పట్టించుకోవట్లేదని డీఎంకే, ఎండీఎంకే నాయకులు గత కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే  ఆదివారం మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.