స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లేదు.. కానీ, వారు కుటుంబాన్ని మాత్రం…: మద్రాసు హైకోర్టు

ఎల్‌జీబీటీక్యూఐఏ కమ్యూనిటీకి చెందిన 25 ఏళ్ల ఓ మహిళ మరో తనలాంటి మహిళతో కలిసి జీవించాలనుకుంటోంది.

ఎల్‌జీబీటీక్యూఐఏ కమ్యూనిటీలకు చెందినవారి వివాహాలకు చట్టబద్ధత లేదని, అయితే, అటువంటి వ్యక్తులు కుటుంబాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. ఓ కేసులో విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఎల్‌జీబీటీక్యూఐఏ కమ్యూనిటీకి ఉండే హక్కులపై వివరణ ఇచ్చింది.

ఎల్‌జీబీటీక్యూఐఏ కమ్యూనిటీకి చెందిన 25 ఏళ్ల ఓ మహిళ మరో తనలాంటి మహిళతో కలిసి జీవించాలనుకుంటోంది. అయితే, ఆ 25 ఏళ్ల లెస్బియన్‌కు చెందిన కుటుంబ సభ్యులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఆమె పార్ట్‌నర్‌ అయిన మరో లెస్బియన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఓ లెస్బియన్ తన ఇష్టానుసారం మరో లెస్బియన్‌తో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది.

Also Read: హైదరాబాద్‌లోనూ వందలాది మంది రోడ్లపైకి వచ్చారు.. ఎవరికైనా ప్రాణనష్టం జరిగితే..?: సీపీ ఆనంద్

తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని గుడియాతంలో ఓ లెస్బియన్‌ తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. మరో మహిళతో ఆమె కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఆమె ఆ పని చేయకుండా తల్లిదండ్రులు ఇంట్లోనే నిర్బంధించారు.

ఆమెను విడిపించడానికి ఆదేశాలు ఇవ్వాలంటూ తిరుపత్తూరు జిల్లాకు చెందిన ఆమె పార్ట్‌నర్‌ (మరో లెస్బియన్) దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై జస్టిస్‌ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ వీ లక్ష్మీనారాయణన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు స్వలింగ జంటల వివాహాన్ని చట్టబద్ధం చేయలేదని.. కానీ, వారు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని మద్రాస్‌ హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.

ఆ లెస్బియన్‌ మహిళ కుటుంబ సభ్యులు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోకుండా ఉండేలా ఆదేశాలు ఇచ్చింది. అవసరమైతే ఆ మహిళ, ఆమె భాగస్వామికి తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. కాగా, స్వలింగ సంపర్కం నేరం కాదని కూడా 2018 సెప్టెంబరు 6న సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.