హైదరాబాద్‌లోనూ వందలాది మంది రోడ్లపైకి వచ్చారు.. ఎవరికైనా ప్రాణనష్టం జరిగితే..?: సీపీ ఆనంద్
అన్ని ఏరియాల్లో ట్రాఫిక్ నిలిచిపోయిందని సీపీ ఆనంద్ చెప్పారు. అదనపు బలగాలను పంపించి, లాఠీచార్జ్ చేసి అక్కడ ఉన్నవారిని చెదరగొట్టాల్సి వచ్చిందని అన్నారు.

CP CV Anand
బెంగళూరులో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ సీపీ సీపీ ఆనంద్ స్పందిస్తూ అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తొక్కిసలాట గురించి ఆశ్చర్యపోయానని, మనం ఎటు వెళ్తున్నామన్న అనుమానం కలిగిందని చెప్పారు.
ఇది జాతీయ జట్టు ప్రపంచకప్ గెలిచిన సందర్భమూ కాదు కదా అని సీపీ ఆనంద్ నిలదీశారు. కేవలం యాడ్స్ కోసం నడుస్తున్న ఫ్రాంచైజీ టీం ఆర్సీబీ అని తెలిపారు. ఈ జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేడని, ఇది హైదరాబాద్‌కు సంబంధించిన టీమ్ కూడా కాదని అన్నారు.
హైదరాబాద్‌లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో నైట్ రౌండ్ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులకు ఊహించని పరిస్థితి ఎదురైందని తెలిపారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మీదకు వందలాది మంది వచ్చి డిస్టర్బ్ చేశారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని అన్నారు.
అన్ని ఏరియాల్లో ట్రాఫిక్ నిలిచిపోయిందని సీపీ ఆనంద్ చెప్పారు. అదనపు బలగాలను పంపించి, లాఠీచార్జ్ చేసి అక్కడ ఉన్నవారిని చెదరగొట్టాల్సి వచ్చిందని అన్నారు. ఒక పోలీస్ అధికారిగా చూస్తే.. ఇలాంటి సెలబ్రేషన్లు ప్రజల భద్రతకు పెద్ద ప్రమాదమని తెలిపారు.
ఇటువంటివి బెంగళూరులో జరిగిన ఘటనలానే ప్రాణహానికి దారితీయవచ్చని సీపీ ఆనంద్ చెప్పారు. హైదరాబాద్‌లో కూడా ఎవరికైనా ప్రాణనష్టం జరిగి ఉంటే..? అని అన్నారు. ఆర్సీబీ కోసం హైదరాబాద్ నగరంలో ఇంత భారీగా సెలబ్రేట్ చేసుకుంటారని అసలు ఎవరూ ఊహించరని చెప్పారు. భవిష్యత్తులో ప్రతి ఘటనపై, ప్రతి వ్యక్తిపై పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.