సాంబర్ సరస్సులో మరణ ఘోష : 5 వేల వలస పక్షులు మృతి

రాజస్థాన్ రాష్ట్రంలోని సాంబార్ సరస్సులో వేలకొద్దీ వలస పక్షులు చనిపోయాయి. దేశంలోనే అతి పెద్ద ఉప్పునీటి సరస్సు ఈ సాంబర్ సరస్సు. ఈ సరస్సుకు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా సాంబార్ సరస్సుకు వేలాది పక్షులు విదేశాల నుంచి వలస వచ్చిన పక్షులు ఉన్నట్టుండి భారీ సంఖ్యలో మరణించాయి. 5 రకాల జాతులకు చెందిన దాదాపు 5వేల పక్షులు మరణించాయి. గత వారం రోజుల నుంచి జరుగుతున్న పక్షుల మరణాలు ఆందోళనకలిగిస్తున్నాయి. చనిపోయిన పక్షుల కళేబరాలు సరస్సు పరిసర ప్రాంతాల్లో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.
దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పంచాయతీ అధికారులు, వన్యప్రాణి సంక్షేమ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మరణించిన వలస పక్షులను పరిశీలించారు. అనంతరం వాటి శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపించారు. వలస పక్షుల మృతికి కారణాలేమిటనేది పరీక్షలో తెలియాల్సి ఉంది. వివిధ రకాల పక్షులతోపాటు బాతులు కూడా మరణించిన పక్షుల్లో ఉన్నాయి.
జైపూర్‌కు చెందిన వైద్య బృందం మరణించిన వలస పక్షుల శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం భోపాల్ నగరంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపినట్లు జైపూర్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అరుణ్ ప్రసాద్ చెప్పారు. వలస పక్షులు మరణించడానికి వైరస్ కారణమని తాము భావిస్తున్నామని పక్షుల పరిశీలకుడు అరుణ్ ప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు. పక్షుల కళేబరాలను తొలగించాలని అటవీశాఖ అధికారులు గ్రామపంచాయతీ అధికారులను ఆదేశించారు.
కాగా..వలస పక్షుల మృతితో ఆందోళన వ్యక్తం అవుతోంది. పక్షుల మరణంతో పర్యావరణానికి ప్రమాదం పొంచి ఉన్నట్లు భావిస్తున్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఈ ప్రాంతంలో వడగళ్ల వాన కురిసిందనీ ఒకవేళ ఆ ప్రభావంతో గానీ లేక వైరస్ వల్ల గానీ పక్షులు చనిపోయి ఉండవచ్చని అటవీ రేంజర్ రాంజేద్ర జఖర్ అభిప్రాయపడ్డారు.