అమానుషం : చేతబడి నెపంతో ముగ్గురు మహిళలు, పురుషుడిని నగ్నంగా ఊరేగించారు

  • Published By: murthy ,Published On : October 10, 2020 / 08:29 AM IST
అమానుషం : చేతబడి నెపంతో ముగ్గురు మహిళలు, పురుషుడిని నగ్నంగా ఊరేగించారు

Updated On : October 10, 2020 / 10:45 AM IST

Practising Witchcraft in Jharkhand Village : టెక్నాలజీ విపరీతంగా పెరిగి పోయి ప్రపంచం మొత్తం అర చేతిలో ఇమడి పోయే రోజుల్లో కూడా చేతబడి చేస్తున్నారనే నెపంతో ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తిని గ్రామస్తులు నగ్నంగా గ్రామమంతా ఊరేగించారు. జార్ఖండ్ రాష్ట్రం, గర్హ్వా జిల్లా నారాయణపూర్ గ్రామంలో గురువారం రాత్రి ఈ అమానుష ఘటన జరిగింది.

నారాయణపూర్ గ్రామంలో నివసించే రాజ్వార్ కుటుంబంలోని ఇద్దరు బాలికలకు ఇటీవల అనారోగ్యం చేసింది. పిల్లల అనారోగ్యానికి చేతబడే కారణం అని ఆకుటుంబ సభ్యులు భావించారు. గ్రామంలోని కొందరు చేతబడి చేస్తున్నారని అనుమానించారు.



గురువారం రాత్రి 10 గంటల సమయంలో, చేతబడి నెపంతో ముగ్గరు మహిళలతో సహా ఒక వ్యక్తిని…. రాజ్వారా కుటుంబ సభ్యులతో పాటు వికాస్ కుమార్ సా, బాబ్లూ రామ్, రాజాద్ పాస్వాన్, రవి కుమార్ రామ్, రాజు రామ్ తదితరులు…. గ్రామంలోని రచ్చబండ దగ్గరకు తీసుకు వచ్చి వారిని కొట్టారు. నలుగురి దుస్తులు వూడ తీయించి నగ్నంగా ఊరంతా తిప్పారు.

జరుగుతున్న అరాచకాన్ని అడ్డుకోటానికి నారాయణపూర్ వార్డ్ కౌన్సిలర్, మరి కొందరు ప్రయత్నించినప్పటికీ రాజ్వార్ కుటుంబ సభ్యులతో సహా, మద్దతుగా నిలిచిన వారు అభ్యంతరం చెప్పారు. దీంతో వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.



సమాచారం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్ధలం వద్దకు చేరుకునే సరికి కొందరు పారిపోయారు. పోలీసులు బాధితులకు బట్టలు అందచేశారు. ఈ చర్యకు పాల్పడిని రాజ్వార్ కుటుంబ సభ్యుల్లోని రవికుమార్, వాసుదేవ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని గర్హ్వా సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ బ్రాహ్మణ టుట్టి తెలిపారు.