టైమ్ మ్యాగజైన్ పై మహిళా రైతులు

women formers
time magazine : ప్రముఖ టైమ్ మ్యాగజైన్ ప్రత్యేక సంచికను వెలువరించింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మహిళల ఫొటోతో సంచిక కవర్ పేజీని ప్రచురించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సంచికను ప్రచురించింది. కవర్ పేజీని ఆ పత్రిక ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.
నన్ను బెదిరించలేరు..నన్ను కొనలేరు అనే శీర్షిక పెట్టింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ..గత మూడు నెలలుగా రైతన్నలు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో నిరసనలు చేపడుతున్నారు. వీరు చేస్తున్న పోరాటానికి పలువురు మద్దతు తెలియచేస్తున్నారు. నిరసనల్లో మహిళా రైతులు కదం తొక్కుతున్నారు.
ఈ క్రమంలో టైమ్ మ్యాగజైన్ మహిళా రైతులతో కూడిన ఫొటోను ప్రచురించడం విశేషం. పంజాబ్, హర్యాణా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు మహిళా రైతులు ఎదుర్కొన్న అనుభవాలు, బాధలను కవర్ స్టోరీలో పొందుపరిచింది. వ్యవసాయ చట్టాలపై మాత్రమే కాకుండా.. స్త్రీహత్య, లైంగిక హింస, పితృస్వామ్యం, లింగ వివక్షకు వ్యతిరేకంగా మహిళలు పోరాటం సాగిస్తున్నారని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.
సరిహద్దులో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా..అన్నదాతలు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అనేక మంది మహిళలు కూడా పాల్గొంటున్నారు. వెన్నుచూపకుండా..వీరు చేస్తున్న ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు లభించింది. రైతులకు మద్దతుగా అంతర్జాతీయ సెలబ్రెటీలు ట్వీట్లు చేయడం దుమారం రేగిన సంగతి తెలిసిందే.
ఉద్యమం వంద రోజులకు చేరుకున్న సందర్భంగా..2021, మార్చి 06వ తేదీ శనివారం బ్లాక్ డేగా పాటించనున్నారు. కుండ్లి – మానేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వేను 5 గంటల పాటు దిగ్భందించనున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మకంగా మారింది. అనూహ్యంగా కొందరు ఎర్రకోటపై దాడి చేశారు. ఆ ఘటనలో కొందరు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. మరోవైపు..కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలు పలు దఫాలు చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు.