కరోనాతో టీఎంసీ అభ్యర్థి కన్నుమూత..ఈసీ అధికారులపై మర్డర్ కేసు పెట్టిన భార్య

Trinamool Candidate Wife Dies Of Covid, Wife Accuses Election Body Of Murder కరోనా సోకి టీఎంసీ అభ్యర్థి మరణించడంతో ఆయ‌న‌ భార్య.. ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థిగా బరిలో నిలిచిన కాజల్ సిన్హా..ప్ర‌చారంలో ఉండ‌గానే క‌రోనా వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్‌కు గురై ఏప్రిల్-25న చ‌నిపోయారు. దాంతో ఆయ‌న భార్య నందితా సిన్హా.. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ తోపాటు ఇతర ఎన్నికల కమిషన్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం,భాద్యతారాహిత్యం వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ నందిత సిన్హా బుధవారం స్వ‌యంగా ఖార్దా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లెయింట్ చేశారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన అభ్యర్థులు, సాధారణ ప్రజల భద్రత కోసం ఎన్నిక‌ల‌ అధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని నందితా సిన్హా తన పిర్యాదులో ఆరోపించారు. వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉందని తెలిసి కూడా ఎన్నిక‌లను ఒకే దశలో నిర్వహించకుండా త‌న భ‌ర్త‌ను బ‌లిగొన్నార‌ని, అందుకుగాను ఈసీ అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె పోలీసుల‌కిచ్చిన ఫిర్యాదులో కోరారు. ఏప్రిల్ 16 యరియు ఏప్రిల్-20న రెండుసార్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ..తదుపరి ఎన్నికల దశలను ఒకేసారి నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ని కోరినట్లు నందితా సిన్హా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ,కరోనా నేపథ్యంలో సాయంత్రం 7గంటల తర్వాత ప్రచారంపై నిషేధం విధిస్తామని,ఎన్నిక ముందు ప్రచారం ముగింపుపై ఉన్న గడువును 24 గంటలనుంచి 72గంటలకు పెంచుతున్నామని ఈసీ పనికిమాలిన సమాధానం ఇచ్చిందని కంప్లెయింట్ లో తెలిపారు.

కాగా, కాజ‌ల్ సిన్హా బ‌రిలో నిలిచిన ఖ‌ద్దా స్థానానికి ఈ నెల 22 నే పోలింగ్ జ‌రిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ఇప్ప‌టివ‌ర‌కు వివిధ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు చ‌నిపోయారు. ఒక‌ స్వతంత్ర అభ్యర్థి కూడా కరోనా బారిన ప‌డి మరణించారు.

ట్రెండింగ్ వార్తలు