ఎట్టకేలకు పెళ్లి సంబంధాల వెల్లువ… తనకు పెళ్లికూతురిని చూసి పెట్టాలంటూ పోలీసులకు మొరపెట్టుకున్న 2 అడుగుల మరుగుజ్జుకి మంచి రోజులు

two-feet-tall-man-who-went-to-the-cops-to-find-a-bride-is-now-juggling-several-proposals

Two Feet Tall Man Azeem Mansuri

Two-Feet Tall Man : అజీమ్ మన్సూరి. వయసు 26ఏళ్లు. గుర్తు పట్టారా?.. లేదా?… ఇంకో క్లూ ఇస్తాం. అతడో మరుగుజ్జు. ఎత్తు, కేవలం రెండున్నర అడుగులు. నాకు పెళ్లి కూతురిని వెతికిపెట్టి పెళ్లి చేయండి మహాప్రభో అంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి విన్నవించుకున్న పొట్టి యువకుడు. ఇప్పుడు గుర్తు వచ్చాడా? అవును.. అతడే.. ఆ మరుగుజ్జే. ఎట్టకేలకు ఆ పొట్టివాడి సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అతడి ఆవేదన తీరింది. అతడి ప్రయత్నం సక్సెస్ అయ్యింది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి పెళ్లి చేయాలని మొరపెట్టుకోవడం మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇప్పుడు మరుగుజ్జు యువకుడికి పెళ్లి సంబంధాలు వెల్లువలా వస్తున్నాయి. నిన్ను పెళ్లి చేసుకుంటాం అంటూ పలువురు అమ్మాయిలు ముందుకొచ్చారు. నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తా అంటూ పలువురు తండ్రులు మ్యారేజ్ ప్రపోజల్స్ పంపారు.

వయసు 26ఏళ్లు, ఎత్తు 2.5 అడుగులు:
26ఏళ్ల అజీమ్ మన్సూరి చాలా పొట్టిగా ఉంటాడు. ఎత్తు కేవలం 2.5 అడుగులే. 5వ తరగతి వరకు చదువుకున్నాడు. వస్త్ర వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. డబ్బు కూడా బాగానే కూడబెట్టుకున్నాడు. సొంత ఇల్లూ ఉంది. బంధువులు, బలగం కూడా బాగానే ఉన్నారు. కానీ, సమస్య ఏంటంటే.. పెళ్లి కావడం లేదు. అతడికి 21 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులు పెళ్లి చూపులు మొదలు పెట్టారు. కానీ, ఐదేళ్లయినా పెళ్లి కుదరడం లేదు. కారణం, అతడి హైటే. మరుగుజ్జు కావడంతో అతడిని పెళ్లి చేసుకునేందుకు ఏ అమ్మాయి కూడా ఇష్టపడ లేదు.

తనకు పెళ్లి చేయాలంటూ సీఎంకి లేఖ:
అయినా అజీమ్ తల్లిదండ్రులు పోరాటం ఆపలేదు. ఒకటి కాదు రెండు కాదు ఐదేళ్లుగా అతడికి పెళ్లి చూపులు చూస్తూనే ఉన్నారు. కానీ ఎన్ని సంబంధాలు చూసినా ఆ కుర్రాడికి పెళ్లి సెట్ అవడం లేదు. అమ్మాయి తరపు వాళ్లు అతడిని చూసేందుకు ఇంటికి రావడం, అబ్బాయిని చూడటం, మాట్లాడటం జరుగుతూనే ఉన్నాయి. ఫోన్ చేసి చెబుతాం అంటూ వెళ్లే వాళ్ల నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు. చివరికి ఆ కుర్రాడికి పెళ్లి చూపుల పట్ల విసుగొచ్చింది. తనకు పెళ్లి చేయాలంటూ ఏకంగా అప్పటి యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కు 2019లో లేఖ కూడా రాశాడు.

పెళ్లి కూతురిని చూసి పెట్టాలని పోలీసులతో మొర:
ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం తనకు పెళ్లి కూతురిని వెతికి పెట్టి, పెళ్లి చేయండంటూ పోలీసులను విన్నవించుకున్నాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అజీమ్.. పబ్లిక్ సర్వీస్ లో భాగంగా తనకు ఈ ఒక్క సాయం చేసి పుణ్యం కట్టుకోండి ప్లీజ్ అంటూ పోలీసుల గడ్డం పట్టుకుని వేడుకున్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే.. అజీమ్ ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చాక అతడి ఫేట్ మారింది. ఇప్పుడు పెళ్లి సంబంధాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. తన సుదీర్ఘ నిరీక్షణ ఫలించడంతో అజీమ్ ఆనందంలో మునిగిపోయాడు.

పెళ్లి సంబంధాల వెల్లువ:
పలు పెళ్లి సంబంధాలు రాగా అందులో ఘజియాబాద్ కి చెందిన 25ఏళ్ల రెహనా అన్సారి.. మనోడికి బాగా నచ్చిందట. ఇక ఢిల్లీ నుంచి మరో యువతి పెళ్లి ప్రపోజల్ పెట్టింది. నువ్వు సింగిల్, నేను సింగిల్.. ఇద్దరమూ మింగిల్ అవుదామా అని అడిగింది. హపూర్, సహరన్ పూర్, మొరాదాబాద్ నగరాల నుంచి పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయని అజీమ్ కుటుంబసభ్యులు చెప్పారు. ఇదంతా దేవుడి దయ అని, త్వరలోనే తన పెళ్లి అవుతుందని అజీమ్ ఆనందంగా చెప్పాడు.

నిద్ర లేని రాత్రులు:
కాగా, పెళ్లిచూపులు జరిగిన ప్రతీసారి అజీమ్ తీవ్ర మనోవేధన ఎదుర్కొన్నాడు. తన హైట్ గురించి చిన్నప్పుడు స్నేహితులు చేసే కామెంట్స్ భరించలేక ఐదో తరగతికే చదువును ఆపేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో పని చేసుకుంటూ వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లి విషయంలో అతడు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాడు. ‘నేను చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా. రాత్రిళ్లు నాకు అసలు నిద్రపట్టదు. నా జీవితాన్ని పంచుకునే వ్యక్తే నాకు దొరకరా అని భయమేస్తుంటుంది. నీకు పెళ్లి అవసరమా అంటూ ఈటల్లాంటి మాటలతో లేఖలు రాస్తుంటారు. నాకు ఇక పెళ్లి కాదని పెళ్లి సంబంధాలు చూడటాన్ని తల్లిదండ్రులు ఆపేశారు‘ అని అజీమ్ గతంలో వాపోయిన రోజులు ఉన్నాయి. మొత్తంగా ఈ మరుగుజ్జుకి మంచి రోజులు వచ్చినట్టే.