Sick Cow: రియల్ హీరోస్.. 200 కిలోల బరువున్న ఆవుని.. వీపు మీద మోస్తూ.. 3 కిమీ నడుస్తూ.. ఆసుపత్రికి తీసుకెళ్లిన సోదరులు..

ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వారు ఎదురు చూడలేదు. వెంటనే రంగంలోకి దిగారు. ఇద్దరూ ఆవును తమ..

Sick Cow: ఈ రోజుల్లో సాటి మనిషిని పట్టించుకునే తీరిక, ఓపిక, సమయం కూడా లేవు. ఎవరు ఎటు పోతే మనకెందుకులే అని అనుకునే రోజులివి. ఎవరైనా ఆపదలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా.. చూసీ చూడనట్లు వెళ్లిపోతున్నారు. మనిషిలో జాలి, దయ కనుమరుగైపోతున్నాయి. మనుషులనే పట్టించుకోని ఈ రోజుల్లో.. మూగజీవాల గురించి పట్టించుకునే వారు ఎంతమంది ఉంటారు?

అయితే, అందరూ అలానే ఉండరు. మనుషుల్లో మానవత్వం ఉన్న వారూ ఉన్నారు. సాటి మనుషులనే కాదు.. మూగజీవాలను కూడా ప్రేమించే వారు ఉన్నారు. అందుకు నిదర్శనమే ఈ ఇద్దరు సోదరులు. అనారోగ్యంతో బాధపడుతున్న 200 కిలోల బరువున్న ఆవుని తమ వీపు మీద మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించి అందరితో శభాష్ అనిపించుకున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అందరి హృదయాలను గెలుచుకుంది. సిర్మౌర్ జిల్లాలోని షిల్లాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని క్యారి గుండా పంచాయతీలో ఇద్దరు వ్యక్తులు దాదాపు 200 కిలోల బరువున్న ఆవుని తమ వీపుపై మోసుకెళ్లారు. అది అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

గ్రామానికి చెందిన దీప్ రామ్ శర్మ ఆవు చాలా రోజులుగా అనారోగ్యంతో ఉంది. అది కదల్లేని పరిస్థితుల్లో ఉంది. ఆవుని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి. లేదంటే అది చనిపోయే ప్రమాదం ఉంది. అయితే, ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అక్కడ సరైన రవాణ సౌకర్యాలు లేవు. పైగా హాస్పిటల్ కి చేరుకోవడానికి ఏకైక మార్గం పర్వత ప్రాంతం గుండా వెళుతుంది. నడుచుకుంటూ వెళ్లడం తప్ప మరో దారి లేదు. ఆ దారి కూడా సరిగా లేదు. నిటారుగా ఉంటుంది. జారిపోయే ప్రమాదం ఉంది.

Also Read: ఫస్ట్ టైమ్.. పావురాలకు ఆహారం పెట్టారని.. క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకిలా..

ఆవు పరిస్థితి చూసి సోదరులైన దయారామ్, లాల్ సింగ్ చలించిపోయారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వారు ఎదురు చూడలేదు. వెంటనే రంగంలోకి దిగారు. ఇద్దరూ ఆవును తమ వీపులపై మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

దయారామ్, లాల్ సింగ్ ఇతర గ్రామస్తుల సాయంతో ఆవుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 200 కిలోల బరువున్న ఆవుని వీపుకి కట్టుకుని 3 కిలోమీటర్లు నడిచారు. ఆ దారి చాలా నిటారుగా ఉంది. మామూలు మనిషి నడవటం కూడా అక్కడ కష్టమే. అలాంటిది 200 కిలోల బరువున్న ఆవుని ఆ దారిలో మోసుకుంటూ తీసుకెళ్లడం అంటే మూమూలు విషయం కాదు. గ్రామస్తులు.. తాళ్ల సాయంతో గోవుని వారి వీపులకు కట్టారు. ఆ తర్వాత వారిద్దరూ పైకి లేచి 3 కిలోమీటర్లు నడిచారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆవును కాపాడటానికి వారు చేసిన ప్రయత్నాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రియల్ హీరోస్ అని కొనియాడుతున్నారు. మూగజీవి పట్ల వారికున్న ప్రేమ నెటిజన్ల హృదయాలను తాకింది. వారి మానవత్వానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

“ఇద్దరు సోదరులు. ఒక జబ్బుపడిన ఆవు. జారే, నిటారుగా ఉన్న పర్వత ప్రాంతాలలో కాలినడకన 3 కిమీ ప్రయాణం” పేరుతో ఉన్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలోని క్యారి ఓ మారుమూల గ్రామం. 200 కిలోల బరువున్న ఆవుని తమ వీపుపై మోసుకెళ్లిన ఆ ఇద్దరు వ్యక్తులు యువకులు అనుకుంటే పొరపాటే. వారిలో ఒకరు వృద్ధుడు. అయినా వెనకడుగు వేయలేదు. 200 కిలోల బరువున్న ఆవును తమ వీపుపై మోసుకెళ్లి ఆసుపత్రికి తరలించారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని వారు సాయం కోసం వేచి ఉండలేదు. ఎవరికీ ఫిర్యాదు కూడా చేయలేదు. జాలి, దయతో నిండిన ఆ వ్యక్తులు.. ఓ మూగజీవి ప్రాణాన్ని కాపాడారు.

“మనం వారి గురించి చాలా గర్వపడాలి. వెయిట్ లిఫ్టింగ్ కోసం జంతువులను ఉపయోగించే మానవులు చాలా కాలంగా ఉన్నారు. ఇక్కడ వారు ప్రేమతో తిరిగి చెల్లిస్తున్నారు. దీన్నే మానవత్వం అంటారు” అని ఒక నెటిజన్ అన్నాడు. “జంతువు పట్ల వారు చూపిన ప్రేమ మాటల్లో వర్ణించలేనిది. మీ ఇద్దరికి నా సెల్యూట్, మీరు రియల్ లైఫ్ హీరోస్” అని మరొక నెటిజన్ ప్రశంసించాడు. సాటి మనిషినే పట్టించుకోని ఈ రోజుల్లో ఓ మూగజీవి ప్రాణాలు కాపాడేందుకు ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన పనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మానవత్వం ఇంకా బతికే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.