Feeding Pigeons: ఫస్ట్ టైమ్.. పావురాలకు ఆహారం పెట్టారని.. క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకిలా..
అనుమానితులను గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Feeding Pigeons: పావురాలకు ఆహారం పెట్టిన వ్యక్తులకు పోలీసులు షాక్ ఇచ్చారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ముంబైలో ఈ ఘటన జరిగింది. ముంబై పోలీసులు నగరంలో తొలిసారిగా బహిరంగంగా పావురాలకు ఆహారం ఇచ్చినందుకు క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఇది శిక్షార్హమైన నేరం. హిందూజా హాస్పిటల్, డొమినోస్ పిజ్జాకు సమీపంలోని LJ రోడ్‌లోని కబూతర్ ఖానా సమీపంలో పావురాల కోసం ధాన్యాలు చల్లిన గుర్తు తెలియని వ్యక్తులపై మహిమ్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేయబడింది.
జూలై 31న బాంబే హైకోర్టు జారీ చేసిన కఠినమైన ఆదేశం ప్రకారం ఈ చర్య తీసుకోబడింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) బహిరంగ ప్రదేశాలు, వారసత్వ ప్రదేశాలలో పావురాలకు ఆహారం పెట్టడంపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అదుపు లేకుండా పావురాల గుమిగూడడం వల్ల కలిగే తీవ్రమైన ప్రజారోగ్య సమస్యలను, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, పర్యావరణ క్షీణతను కోర్టు నొక్కి చెప్పింది.
పావురాలకు ఆహారం పెట్టినందుకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దేశంలోనే ఇదే తొలిసారి. బహిరంగ ప్రదేశాల్లో పావురాలకు ఆహారం పెట్టడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బాంబే హైకోర్టు ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. ముంబై మహా నగరంలోని కీలక ప్రాంతాల్లో పావురాల రద్దీని నియంత్రించడానికి, కఠినమైన చర్యలు అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది కోర్టు.
నిందితులు ఉదయం 6:50 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. పావురాలకు ఆహారం పెట్టి ఆ తర్వాత వెళ్లిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. బైక్ నెంబర్ ప్లేట్ స్పష్టంగా లేకపోవడంతో వారి గుర్తింపు ఇంకా తెలియలేదు. అనుమానితులను గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఈ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు..
* సెక్షన్ 223 (ప్రభుత్వ ఉద్యోగి ఆదేశానికి అవిధేయత)
* సెక్షన్ 270 (ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దుర్మార్గపు చర్య)
* సెక్షన్ 271 (క్వారంటైన్ నియమాలను ఉల్లంఘించే నిర్లక్ష్యం)
ఇవి ఇటీవల భారత శిక్షాస్మృతి స్థానంలో వచ్చిన కొత్త భారతీయ న్యాయ సంహితలో భాగం.
న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించడంపై న్యాయమూర్తులు గిరీష్ కులకర్ణి, ఆరిఫ్ డాక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పావురాలకు ఆహారం పెట్టే వారికి మధ్యంతర ఉపశమనం కల్పించడానికి ధర్మాసనం గతంలో నిరాకరించింది. ఇటీవలి విచారణ సందర్భంగా, “వారు చట్ట నియమాలను పాటించకూడదనుకుంటే, చట్టం వారిని పట్టుకోవాలి” అని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో పావురాలకు ఆహారం ఇవ్వడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, మనిషి ప్రాణాలకు ప్రత్యక్ష ముప్పు వాటిల్లుతుందని కోర్టు నొక్కి చెప్పింది.
కోర్టు ఆదేశానికి అనుగుణంగా BMC కఠిన చర్యలు చేపట్టింది. దాదర్ వెస్ట్‌లోని ఐకానిక్ కబూతర్ ఖానా వద్ద అనధికార ఫీడింగ్ జోన్‌లు, నిర్మాణాలు తొలగించబడ్డాయి. నిరంతరం పర్యవేక్షణ కోసం బీట్ మార్షల్స్, పోలీసుల మద్దతుతో మూడు షిఫ్టుల్లో అధికారులను మోహరిస్తారు. సున్నితమైన ప్రాంతాల్లో CCTV కెమెరాల ఏర్పాటు కూడా తప్పనిసరి చేయబడింది.
ఈ కఠిన చర్యలను అనేక జంతు సంక్షేమ సంస్థలు విమర్శించాయి. ఈ నిషేధం రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(g)ని (జీవుల పట్ల కరుణ), జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తుందని వాదించాయి. ఈ నెల ప్రారంభంలో 500 మందికి పైగా కార్యకర్తలు శాంటాక్రూజ్‌లో నిరసన చేపట్టారు. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: ప్రధాని మోదీ తొలి మహిళా బాడీగార్డ్.. ఎవరీ అదాసో కపేసా.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..