Adaso Kapesa: ప్రధాని మోదీ తొలి మహిళా బాడీగార్డ్.. ఎవరీ అదాసో కపేసా.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

సోషల్ మీడియా ప్రశంసలతో నిండిపోయింది. లింగంతో సంబంధం లేకుండా సంకల్పం, క్రమశిక్షణ, నైపుణ్యం ఉంటే ఏమైనా సాధించగలరు అనే దానికి శక్తివంతమైన..

Adaso Kapesa: ప్రధాని మోదీ తొలి మహిళా బాడీగార్డ్.. ఎవరీ అదాసో కపేసా.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Updated On : August 3, 2025 / 5:47 PM IST

Adaso Kapesa: ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ వెనక నిలబడి ఉన్న ఒక మహిళ చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరు? ఎందుకు ప్రధాని పక్కన నిలబడింది? అని నెటిజన్లు ఆరా తీశారు. ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీ పక్కనే నిలబడి ఉన్న ఆమె.. లేడీ బాడీగార్డ్. ఆమె ప్రధాని మోదీ తొలి మహిళా బాడీగార్డ్. పేరు అదాసో కపేసా.. ఇప్పుడు ఈమె గురించే సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అత్యంత కీలకమైన బాధ్యతలో ఓ మహిళ ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు ప్రశంసల వర్షమూ కురుస్తోంది.

ప్రధాని మోదీ వెనకున్న మహిళకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాని వెనుకున్న మహిళ.. ఇన్‌స్పెక్టర్ అదాసో కపేసా. మణిపూర్‌కు చెందిన ఒక ట్రైల్‌బ్లేజర్. అత్యున్నత స్థాయి సెక్యూరిటీ ఫోర్స్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) లో ఈమె ఎలైట్ కమాండోగా పని చేస్తున్నారు. ఈ బృందం ప్రధాని, ఆయన కుటుంబసభ్యులకు భద్రత కల్పిస్తుంది. కఠినమైన శిక్షణ, సామర్థ్యం ఉన్న వారు మాత్రమే SPGలో భాగం కాగలుగుతారు. అదాసో కపేసా ఎంపిక భారత భద్రతా వ్యవస్థలో మహిళల పాత్రకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రధానమంత్రిని రక్షించడానికి అంకితమైన భారతదేశపు ఉన్నత దళం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)లో పనిచేసిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు అదాసో. ప్రధాని మోదీ సెక్యూరిటీ టీమ్ లో ఉన్న మణిపూర్ నుంచి తొలి మహిళగా ఆమె రికార్డ్ సృష్టించారు.

ఆమె ప్రయాణం హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర సాయుధ పోలీసు దళం సశస్త్ర సీమా బల్ (SSB)లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఆమె ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌లో ఉన్న 55వ బెటాలియన్‌లో సేవలందిస్తోంది. SPGలో ఆమె చేరిక భారతదేశంలో భద్రత, చట్ట అమలులో మహిళలకు ఒక కీలకమైన ఘట్టాన్ని సూచిస్తుంది.

ప్రధానమంత్రి భద్రతా బృందానికి అదాసో కపేసా నియామకం వ్యక్తిగత విజయం కంటే ఎక్కువ. ఇది భారత రక్షణ, పారామిలిటరీ సేవలలో పెరుగుతున్న లింగ సమ్మిళితత్వానికి చిహ్నం. ప్రధాని మోడీ UK పర్యటన సందర్భంగా ఆమె పక్కన కనిపించడం పురోగతికి కనిపించే సంకేతం.

సోషల్ మీడియా ప్రశంసలతో నిండిపోయింది. లింగంతో సంబంధం లేకుండా సంకల్పం, క్రమశిక్షణ, నైపుణ్యం ఉంటే ఏమైనా సాధించగలరు అనే దానికి శక్తివంతమైన ఉదాహరణగా అదాసో కపేసాన అభివర్ణించారు. ఆమె ఒక రోల్ మోడల్ అని కీర్తించారు. మణిపూర్ రాష్ట్రం సేనాపతి జిల్లా కైబి గ్రామానికి చెందిన మావో, నాగా లేడీ అదాసో కపేసాను చూసి చాలా గర్వంగా ఉందంటున్నారు మహిళలు.

Also Read: 600 ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం.. కారణం అదేనా.. వీడియోలు వైరల్..