Volcano Erupts: 600 ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం.. కారణం అదేనా.. వీడియోలు వైరల్..

అగ్నిపర్వతం 1,856 మీటర్ల ఎత్తులో ఉంది. అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత 6,000 మీటర్లు ఎత్తుకు బూడిద పొగ లేచిందని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖకు చెందిన కమ్చట్కా శాఖ తెలిపింది.

Volcano Erupts: 600 ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం.. కారణం అదేనా.. వీడియోలు వైరల్..

Updated On : August 3, 2025 / 4:57 PM IST

Volcano Erupts: భారీ భూకంపం రష్యాపై పెను ప్రభావమే చూపింది. అక్కడ ఓ అగ్నిపర్వతం బద్దలైంది. 600 ఏళ్ల తర్వాత ఆ అగ్నిపర్వతం బద్దలు కావడం ఆసక్తికరంగా మారింది. దీనికి ఇటీవల వచ్చిన భారీ భూకంపమే కారణం అని తెలుస్తోంది.

రష్యాలోని కమ్ చట్కా ద్వీపంలోని క్రాషెన్నినికోవ్ వాల్కనో బద్దలైంది. గత 600 ఏళ్లలో ఈ అగ్నిపర్వతం బద్దలవడం ఇదే తొలిసారి. రష్యాలో గత వారం భారీ భూకంపం వచ్చింది. దాని వల్లే ఇప్పుడీ అగ్నిపర్వతం బద్దలై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. “600 సంవత్సరాలలో క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం ఇదే మొదటిసారి” అని కమ్చట్కా అగ్నిపర్వత విస్ఫోటన ప్రతిస్పందన బృందం అధిపతి ఓల్గా గిరినా చెప్పారు.

”బుధవారం సంభవించిన భూకంపంతో ఈ విస్ఫోటనం ముడిపడి ఉండొచ్చు. దీని వల్ల ఫ్రెంచ్ పాలినేషియా, చిలీ వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కమ్చట్కా ద్వీపకల్పంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతం క్లూచెవ్స్ కోయ్ విస్ఫోటనం సంభవించింది” అని ఓల్గా గిరినా తెలిపారు. క్రాషెన్నినికోవ్ చివరి లావా ఎఫ్యూషన్ 1463లో జరిగిందని గిరినా గుర్తు చేశారు. అప్పటి నుండి ఎటువంటి విస్ఫోటనం జరగలేదన్నారు.

అగ్నిపర్వతం 1,856 మీటర్ల ఎత్తులో ఉంది. అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత 6,000 మీటర్లు ఎత్తుకు బూడిద పొగ లేచిందని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖకు చెందిన కమ్చట్కా శాఖ తెలిపింది.

”బూడిద మేఘం తూర్పు వైపు, పసిఫిక్ మహాసముద్రం వైపు మళ్లింది. దాని మార్గంలో జనసాంద్రత ఉన్న ప్రాంతాలు లేవు” అని మంత్రిత్వ శాఖ తెలిపింది. అగ్నిపర్వతం విస్ఫోటనంతో అరెంజ్ కలర్ ఏవియేషన్ కోడ్ జారీ చేశారు. ఇది విమానాలకు అధిక ప్రమాదాన్ని సూచిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

వాల్కనో విస్ఫోటనంకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అది చూడటానికి చాలా భయానకంగా ఉంది. తెల్లటి బూడిద పొగ ఆకాశాన్ని కమ్మేసింది.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి శక్తివంతమైన క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం విస్ఫోటనం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో అనే ఆందోళన నెలకొంది. గత వారం కమ్చట్కాలో భారీ భూకంపం వచ్చింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన వాటిలో ఒకటి. రిక్టర్ స్కేల్ మీద 8.8 తీవ్రత నమోదైంది.

Also Read: చనిపోయి మళ్లీ బతకాలనుకుంటున్నారా? రిజిస్టర్ చేసుకోండి.. ఇప్పటికే 650 మంది చేసుకున్నారు.. జర్మన్ సంస్థ ఏం చేస్తోందంటే?