Union Budget 2026
Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టే టైమ్ అయింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో అసలు మధ్యతరగతి జనం ఏం కోరుకుంటున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. ఆల్రెడీ 2024 ఎన్నికల సమయంలో భారీ ఎత్తున వరాలు ప్రకటించిన నేపథ్యం ఉంది. మరోవైపు అమెరికా టారిఫ్ పేరుతో బెదిరిస్తోంది. ఇలాంటి సమయంలో కేంద్రం ఏం చేస్తుందనే ఆసక్తి నెలకొంది. అలాంటప్పుడు మధ్యతరగతి జనం భారీగా వరాలు ఎక్స్‌పెక్ట్ చేసే చాన్స్ లేదు. భారీ ట్యాక్స్ కట్‌లు, తాయిలాలు ప్రకటించే అవకాశాలు కూడా లేవు. కాకపోతే తమ జేబులు చిల్లు పడకుండా ఉంటే చాలనే అభిప్రాయం ఉంటుంది. వారికి రేట్లు పెరగకుండా ఉంటే చాలు. ద్రవ్యోల్బణం పెరగకుండా ఉంటే చాలు. రోటీ, కపడా, మకాన్‌కి సమస్య లేకుండా గడిచిపోతే చాలనే అభిప్రాయం ఉంటుంది.
సాధారణంగా మధ్యతరగతి ప్రజల జీవనం ఎక్కువగా ఉద్యోగాల మీద ఆధారపడి ఉంటుంది. వారికి ఉద్యోగ భద్రత కావాలి. ఉద్యోగం ఇవాళ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి రావొద్దు. జాబ్స్ పోవొద్దు. అలా స్థిమితంగా ఉంటే వారు హ్యాపీ. అదే టైమ్‌లో జాబ్ ఉన్నా కూడా రేట్లు అమాంతం పెరిగిపోతే మాత్రం కష్టం. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగితే వారి జేబులకు చిల్లు పడుతుంది. అది వారిని అప్పుల పాలు చేస్తుంది. రోజు గడిచే పరిస్థితే గగనంగా మారితే అప్పుడు వారు తమ కంటే పై స్థాయి ఫెసిలిటీస్ కోరుకోలేరు. దాని వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయి.
సొంతిల్లు అనేది కొన్ని కోట్ల మంది కల. అలాంటి కల సాకారం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని మధ్యతరగతి జనం కోరుకోవడం సహజం. పేదలకు ప్రభుత్వాలు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వొచ్చు. కానీ, మధ్యతరగతిని పట్టించుకునేది ఎవరు? వారికి సొంతిల్లు అవసరమే కదా. వారికి వారు తమ సొంతిల్లు కట్టుకోవడానికి, కొనుక్కోవడానికి అందుబాటులో ఉండేలా ఇళ్ల ధరలు ఉంటే చాలు. అలాగే, వారు లోన్లు తీసుకునేటప్పుడు హౌసింగ్ లోన్స్ ఇప్పుడున్న దానికంటే ఇంకొంచెం తక్కువ ధరల్లో అందుబాటులోకి వస్తే అదే పదివేలు.
అలాగే, ఇంటి అద్దెలు కూడా రాకెట్ లా దూసుకుపోతున్నాయి. ప్రతి మూడేళ్లకు మాత్రమే అద్దెలు పెంచాలని నిబంధనలు ఉన్నా కూడా ఎవరూ పట్టించుకునే అవకాశాలు ఉండవు. ఈ లెక్కన ప్రతి ఏడాది జీతాలు పెరగకపోయినా, అద్దెలు పెరిగిపోవడంతో అప్పుల పాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, రెంటల్ హౌసింగ్ స్కీమ్స్ లాంటివి అమలు చేస్తే బావుంటుంది.
ఇప్పటికే రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ప్రకటించింది కేంద్రం. అలాగే, జీఎస్టీలో కూడా చాలా సంస్కరణలు తీసుకొచ్చింది. దీంట్లో రేట్లు తగ్గాయి. కానీ, ఆ తగ్గిన రేట్లు ఇతర మార్గాల్లో ఖర్చయిపోతున్నాయి. ఇంటి అద్దెలు, ట్రాన్స్ పోర్ట్, ఇతర ఖర్చుల వల్ల ఆ లాభం కనిపించడం లేదు. ఫైనల్‌గా మధ్యతరగతి జనం కోరుకునేది ఏంటేంటే.. జాబ్‌కి ఢోకా లేకుండా, రేట్లు పెరగకుండా ఉంటే చాలు.