పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. సివిల్‌ మాక్‌ డ్రిల్స్‌కు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు.. సైరన్లు మోగిస్తారు.. ఇంకా ఏమేం చేస్తారంటే?

అత్యవసర సమయాల్లో ఏమి చేయాలో నేర్పించడానికి ప్రజలకు శిక్షణ ఇవ్వనున్నారు.

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోని అనేక రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. శత్రువులు దాడి చేసే సమయంలో పాటించే పౌర రక్షణ విధానాలను బలోపేతం చేయడం, పరీక్షించడం కోసం మే 7న మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఎయిర్‌ రైడ్‌ సైరన్ టెస్టులు, పౌర శిక్షణ, బ్లాక్అవుట్ ప్రొటోకాల్‌లు, ప్రజల తరలింపు ప్రక్రియ వంటి రిహార్సల్స్‌ ఉంటాయి.

సాధారణంగా యుద్ధం లేదా వైమానిక దాడులు వంటి అత్యవసర పరిస్థితులకు సిద్ధం కావడానికి ఇటువంటి మాక్ డ్రిల్స్‌ చేస్తారు. వైమానిక దాడి చేస్తున్నారన్న దాన్ని సూచించడానికి సైరన్‌లు మోగిస్తారు. యుద్ధ జరిగితే శత్రువుల వైమానిక దాడుల గురించి ప్రజలను హెచ్చరించడానికి వీటిని మోగిస్తారు.

Also Read: భారత సైనికుడు ఒక్కడు చాలు.. అప్పుడు ఒకే ఒక్కడు 60 మంది పాక్‌ రేంజర్లను ఎలా ఆపాడో తెలుసా?

అత్యవసర సమయాల్లో ఏమి చేయాలో నేర్పించడానికి ప్రజలకు శిక్షణ ఇవ్వనున్నారు. క్రాష్ బ్లాక్అవుట్ ప్రొటోకాల్‌ గురించి కూడా అవగాహన కల్పిస్తారు. క్రాష్ బ్లాక్అవుట్లో భాగంగా రాత్రి సమయంలో శత్రు దేశ యుద్ధ విమానాల్లోని వ్యక్తులు భూమిపై ముఖ్యమైన ప్రాంతాలను చూడకుండా రాత్రిపూట అన్ని లైట్లు ఆపేస్తారు.

విద్యుత్ కేంద్రాలు లేదా సైనిక భవనాలు వంటివాటిని శత్రువులు తమ యుద్ధ విమానాల నుంచి చూడకుండా చేయడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మాక్‌ డ్రిల్‌లో భాగంగా ఈ ప్రక్రియను కూడా నేర్పిస్తారు. పెద్ద పెద్ద బ్లాంకెట్లతో వాటిని కప్పడం, భవనాలకు పెయింట్ వేయడం, పొగలు వచ్చేలా చేయడం వంటి అనేక విధానాలను ఇందుకోసం పాటించవచ్చు. అవసరమైతే ప్రజలు సురక్షితంగా, త్వరగా ఎలా మరోచోటికి వెళ్లారో రిహార్సల్ ద్వారా చూపిస్తారు.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ ఉగ్రవాదులపై భారత్‌ సైనిక చర్యలకు దిగనున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఒకవేళ యుద్ధం జరిగితే తీసుకోవాల్సిన ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర సర్కారు సూచనలు చేస్తోంది. మొదట సరిహద్దు రాష్ట్రాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది.