భారత సైనికుడు ఒక్కడు చాలు.. అప్పుడు ఒకే ఒక్కడు 60 మంది పాక్‌ రేంజర్లను ఎలా ఆపాడో తెలుసా?

తెల్లవారుజామున పూనమ్ సింగ్ పాకిస్థాన్ దళాల కమాండర్ అఫ్జల్ ఖాన్‌ని హతమార్చారు.

భారత సైనికుడు ఒక్కడు చాలు.. అప్పుడు ఒకే ఒక్కడు 60 మంది పాక్‌ రేంజర్లను ఎలా ఆపాడో తెలుసా?

Updated On : May 5, 2025 / 7:25 PM IST

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వల్ల భారత్‌ – పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గతంలో భారత్‌ – పాక్ మధ్య నాలుగు సార్లు యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. 1971, 1999 వంటి యుద్ధాల్లో పాకిస్థాన్‌ను భారత్‌ చిత్తుగా ఓడించినప్పటికీ ఆ దేశం తన తీరును మార్చుకోవడం లేదు.

ఈ రెండు యుద్ధాలు జరగడానికి ముందు 1947–1948, 1965లో కశ్మీర్‌ కోసం యుద్ధాలు జరిగాయి. 1965 యుద్ధంలో ఓ భారత జవాను ప్రదర్శించిన ధైర్యసాహసాలను దేశం ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ సమయంలో ఒకే ఒక్క భారత జవాన్‌ 60 మంది పాకిస్థాన్ రేంజర్లు దాడి చేయకుండా నిలువరించారు.

ఆయనే పూనమ్ సింగ్. ఇప్పుడు మళ్లీ పాక్‌ – భారత్‌ మధ్య యుద్ధం జరుగుతుందన్న అంచనాల వేళ పూనమ్ సింగ్ శౌర్యాన్ని చాలా మంది గుర్తుచేసుకుంటున్నారు.

పాక్‌ రేంజర్లు 60 మంది ఆ సమయంలో సరిహద్దుకు సమీపంలో ఉన్న కీలక ప్రాంతమైన భుట్టేవాల్లా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ భుట్టేవాలా చౌక్ ఇండో-పాక్ సరిహద్దు నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్‌లో ఉంది.

భారత్ – పాక్ మధ్య 1965 యుద్ధం ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 23 వరకు కొనసాగింది. ఒకరోజు రాత్రి అఫ్జల్ ఖాన్ నేతృత్వంలో 60 మందికి పైగా పాకిస్థాన్ రేంజర్లు భుట్టేవాలా వద్ద భారత పోస్ట్‌పై దాడి చేశారు.

Also Read: అంతరిక్షంలో యుద్ధ విన్యాసాలు.. ఇస్రో మరో ఘనత.. పాక్‌తో ఉద్రిక్తతల వేళ..

పూనమ్ సింగ్ భాటి మరో ఏడుగురు భారతీయ సైనికులతో కలిసి పాక్‌ రేంజర్లతో ధైర్యంగా పోరాడారు. అటు పాక్‌ రేంజర్లేమో 60 మంది మన సైనికులు మాత్రం కేవలం ఎనిమిది మందే ఉన్నారు. అయినప్పటికీ, మన సైనికులు ఏ మాత్రం బెదరకుండా, వెన్ను చూపకుండా మాతృభూమి కోసం భీకర పోరాటం చేశారు.

పాక్‌ క్యాంప్‌ నుంచి బుల్లెట్లు తీసుకొచ్చి మరీ..
పోరాటం చేస్తున్న సమయంలో భారత సైనికుల వద్ద బుల్లెట్లు తక్కువగా ఉండడంతో అవి అయిపోతున్నాయి. ఆ సమయంలో పూనమ్ సింగ్ ఎంతో ధైర్యంగా బుల్లెట్లను తీసుకురావడానికి శత్రు శిబిరంలోకి ఒంటరిగా వెళ్లారు.

అక్కడి నుంచి మందుగుండు సామగ్రిని తిరిగి తీసుకువచ్చారు. పాక్ రేంజర్లపై మన సైనికులు దాడులు కొనసాగించారు. దీంతో పాక్‌ సైనికులను తన ధైర్యసాహసాలతో పూనమ్‌ సింగ్‌ ఒక్కడే నిలువరించినట్లయింది.

తెల్లవారుజామున పూనమ్ సింగ్ పాకిస్థాన్ దళాల కమాండర్ అఫ్జల్ ఖాన్‌ని హతమార్చారు. అంతేగాక, మరో ఎనిమిది మంది పాకిస్థాన్ సైనికులను కూడా మట్టుబెట్టారు. అదే పోరాటంలో పూనమ్ సింగ్ మృతి చెందారు. దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన పూనమ్‌ సింగ్‌ను తలుచుకుంటే సైనికుల్లో ధైర్యసాహసాలు రెట్టింపు అవుతాయి.

పూనమ్ సింగ్ వీరోచిత పోరాటంతో మిగిలిన పాకిస్థాన్ సైనికులు అక్కడి నుంచి పారిపోయారు. సింగ్ కారణంగా భుట్టేవాలా చెక్‌పోస్ట్ భారతదేశ నియంత్రణలోనే ఉంది. ఆయన ధైర్యసాహసాలను, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ చెక్‌పోస్ట్ వద్ద స్మారక చిహ్నాన్ని నిర్మించారు.