అంతరిక్షంలో ఇస్రో విన్యాసాలు అదుర్స్.. శాటిలైట్లతో ‘డాగ్ ఫైట్’… 29,000 కిలోమీటర్ల స్పీడ్ తో ఒకదాని వెంట మరొకటి..
సాధారణంగా డాగ్‌ఫైట్ అనేది ఒక రకమైన గగనతల యుద్ధం.

అంతరిక్షంలో చైనా ఉపగ్రహాలను వాడుతూ మిలటరీ స్టైల్‌లో “డాగ్‌ఫైట్స్” చేసిందని అమెరికా గత నెల ఆరోపించింది. ఇప్పుడు భారత్ కూడా అదే తరహా “డాగ్‌ఫైట్స్”ను విజయవంతంగా నిర్వహించింది. పాక్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టడం గమనార్హం.
సాధారణంగా డాగ్‌ఫైట్ అనేది ఒక రకమైన గగనతల యుద్ధం. దీనిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ యుద్ధ విమానాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా వెళ్తాయి. గగనతలంలో వేగంగా ప్రయాణిస్తూ శత్రు దేశ విమానాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాయి.
ఆ సమయంలో శత్రు దేశ యుద్ధ విమానం నుంచి తప్పించుకోవడానికి మరో యుద్ధ విమానం చాలా వ్యూహాత్మక రీతిలో గింగిరాలు తిరుగుతూ ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయాల్లో గగనతలంలో ఈ రకమైన పోరాటాలు సర్వసాధారణంగా జరిగాయి. ఇప్పుడు ఇదే రీతిలో అంతరిక్షంలో యుద్ధాలు చేసే సామర్థ్యాలను పెంచుకోవడానికి అగ్ర దేశాలు పోటీ పడుతున్నాయి. దీన్నే శాటిలైట్ డాగ్‌ఫైట్ అంటారు.
Also Read: ఇందుకే ఐఫోన్లు అంటే అందరికీ ఇష్టం.. ఎంతటి అద్భుతమైన ఫీచర్లు ఉండనున్నాయో తెలుసా?
అంతరిక్షంలో “డాగ్‌ఫైట్” ఇలా?
అంతరిక్షంలో “డాగ్‌ఫైట్” అంటే ఉపగ్రహాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా కదులుతాయి. వేగంగా వెళ్తూ విన్యాసాలు చేస్తాయి. గగనతలంలో ఫైటర్ జెట్‌లు పోరాటంలో పాల్గొన్నట్లుగానే అంతరిక్షంలో ఉపగ్రహాలు కూడా పోరాటంలో పాల్గొంటాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో అంతరిక్ష యుద్ధాలు జరగలేదు.
“భవిష్యత్తులో యుద్ధాలు అన్నీ అంతరిక్షంలోనే..” అన్న భయాలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ అంతరిక్షంలో యుద్ధం జరిగితే శత్రుదేశ ఉపగ్రహాలపై దాడి చేయడం, మన ఉపగ్రహాలను రక్షించుకోవడం వంటి వాటిని సాధన చేసేందుకు ఇస్రో తాజాగా శాటిలైట్ డాగ్‌ఫైట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేసింది. అంతరిక్షంలో మన దేశ శక్తిని చాటింది. ఇస్రో ఇటువంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి.
అంతరిక్ష “డాగ్‌ఫైట్”లో ఫైటర్ జెట్‌లు పాల్గొనవు. అంతరిక్ష “డాగ్‌ఫైట్”లో ఉపగ్రహాలే పాల్గొంటాయి. ఇందులో భాగంగా శత్రుదేశ ఉపగ్రహంపై నిఘా పెట్టడానికి, వాటి దాడి నుంచి తప్పించుకోవడానికి లేదా దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇది అంతరిక్ష వెర్షన్ “డాగ్‌ఫైట్” లాంటిది. “ఉపగ్రహం వర్సెస్ ఉపగ్రహం” ఫైట్ అనమాట.
ఇస్రో ఇలా సాధించింది..
ఇస్రో ప్రస్తుతం స్పేడెక్స్ (SPADEX) మిషన్‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఛేజర్ (SDX 01), టార్గెట్ (SDX 02) అనే శాటిలైట్లు గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంటాయి.
అంటే, కమర్షియల్ ప్యాసింజర్ జెట్ల కంటే 28 రెట్లు వేగంగా వెళ్తాయి. వీటిని పరస్పరం దగ్గరకు తీసుకురావడం వంటి ప్రయోగాలను ఇస్రో విజయవంతంగా ముగించింది. అంతరిక్షంలో “డాగ్‌ఫైట్” వంటి విన్యాసం ఇది.
ఇస్రో చేపట్టిన ఒరిజినల్ మిషన్‌లో అసలు ఈ “డాగ్‌ఫైట్” జాబితాలో లేదు. అయితే, ఇంధన నిర్వహణ ప్రక్రియను మరింత బాగా కొనసాగించడానికి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. మిషన్ పూర్తి అయిపోయిన తర్వాత మిగిలిపోయిన ఇంధనాన్ని ఇస్రో ఉపగ్రహ విన్యాసాలను చేయడానికి ఉపయోగిస్తోంది.
ఇప్పటికే ఇస్రో రెండు సార్లు డాకింగ్, అన్‌డాకింగ్ పూర్తి చేసింది. గత నెల 21న ఒక శాటిలైట్ నుంచి మరో శాటిలైట్‌కు విద్యుత్‌ను బదిలీ చేసింది. ఈ ప్రక్రియ ద్వారా హీటర్ ఎలిమెంట్ పనిచేసేలా చేశారు. ఈ ప్రయోగాల అనంతరం శాటిలైటర్లలో సుమారు 50 శాతం ఇంధనం మిగిలిపోయింది.
చైనా స్పేస్ డాగ్‌ఫైట్స్ వంటి సామర్థ్యాన్ని ప్రదర్శించిన వేళ భారత్ కూడా ఇటువంటి విజయమే సాధించడం గమనార్హం. స్పేడెక్స్ మిషన్‌తో ఇప్పటికే భారత్ డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించింది. ఇంతకు ముందు రష్యా, అమెరికా, చైనా దేశాలు ఇందులో విజయవంతమయ్యాయి.
పాక్‌తో ఉద్రిక్తతల వేళ..
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత సహా పాక్‌పై ఇప్పటికే భారత్ పలు చర్యలు తీసుకుంది. పాక్‌లోని ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేలా భారత్ సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగుతుందా? అన్న సందేహాలూ వస్తున్నాయి. ఈ సమయంలో ఇస్రో స్పేస్ “డాగ్‌ఫైట్స్” ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం గమనార్హం.