Unnatural act by husband not an offence
Physical Relationship : భార్యకు ఇష్టం లేకపోయినా ఆమెపై భర్త బలవంతపు అసహజ లైంగిక చర్యకు పాల్పడితే అది నేరం కాదంటూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త తన భార్యతో బలవంతపు లైంగిక సంబంధం పెట్టుకోవడం లేదా లైంగిక చర్యలకు పాల్పడటం అత్యాచారం కాదని, అందువల్ల, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 కింద ఏదైనా అసహజ లైంగిక చర్య భర్త తన భార్యతో చేస్తే.. దానిని కూడా నేరంగా పరిగణించలేమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది.
Read Also : Google Pixel 9 : ఆఫర్ భలే ఉంది భయ్యా.. ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్‌పై ఏకంగా రూ.9వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!
2017లో తన భార్య మరణానికి సంబంధించిన కేసులో బస్తర్ జిల్లాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి దోషిగా నిర్ధారించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు విచారిస్తోంది. బలవంతపు అసహజమైన లైంగిక సంబంధం కారణంగా ఆ మహిళ అనారోగ్యానికి గురై మరణించిందనే ఫిర్యాదుపై సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఏం చెప్పిందంటే? :
జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 376, 377 ప్రకారం, భార్యకు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉంటే భర్త తన భార్యతో లైంగిక సంబంధం కలిగి ఉన్నందుకు దోషిగా నిర్ధారించలేమని ఆయన అన్నారు. ‘లైవ్ లా’ నివేదిక ప్రకారం, భార్య అంగీకరించకపోయినా, అది అత్యాచారం కేసుకు కిందకు రాదని కోర్టు కూడా పేర్కొంది.
అసలు కేసు ఏంటంటే? :
వాస్తవానికి, 2017 డిసెంబర్ 11 నాటి కేసు ఇది. భార్యకు ఇష్టం లేకుండా ఆమెతో అసహజ లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ సంఘటన తర్వాత, భార్యను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది.
అయితే, ఆ మహిళ తరువాత మరణించింది. కానీ, ఆ మహిళ పెరిటోనిటిస్ మల రంధ్రం కారణంగా మరణించిందని వైద్యులు నిర్ధారించారు. బాధితురాలు మరణ వాంగ్మూలంలో ఇదే విషయాన్ని చెప్పింది. పోస్టుమార్టం నివేదికలో కూడా ఇదే తేలింది.
ఈ కేసుపై విచారించిన అప్పటి ట్రయల్ కోర్టు భర్తకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. వివాహం తర్వాత లైంగిక సంబంధాలు అత్యాచారం కిందకు రావని చెప్పిన హైకోర్టు.. భార్య వయస్సు 15 ఏళ్లు ఎక్కువ ఉంటే అది నేరంగా పరిగణించలేమని తెలిపింది.
భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో అసహజ శృంగారంలో పాల్గొనడం నేరం కాదని తేల్చిచెప్పేసింది. ఫిబ్రవరి 10న అప్పీలుదారుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు న్యాయమూర్తి నరేంద్ర కుమార్ తీర్పు వెలువరించారు. మరణ వాంగ్మూలం కచ్చితత్వంపై కూడా కోర్టు సందేహం వ్యక్తం చేసింది.