UP election 2022 : మోడీ-యోగి సర్కార్‌ను ఏకిపారేసిన సోనియా గాంధీ.. ఇక దిగిపోండి.. యూపీ ప్రజలు కళ్లు తెరిచారు!

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రధానమైనవని, రాబోయో ఐదేళ్లకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని సోనియా గాంధీ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం ఎలాంటి హమీలు నెరవేర్చలేదని విమర్శించారు.

UP election 2022 : Modi-Yogi Government : ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. విడత విడతకు ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముగిసిన విడతల్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని రాజకీయ పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మిగిలిన దశల్లో పోలింగ్‌పైనా ఆధిపత్యం కోసం పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రచార బరిలో దిగారు. కోవిడ్ రీత్యా వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సోనియా గాంధీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాల వైఫల్యాలను ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ రెండు ప్రభుత్వాలు ఓటర్లను నిలువునా మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనా కష్ట కాలంలో ప్రజలను ఆదుకోలేక ముఖం చాటేశాయని ఆమె ధ్వజమెత్తారు.

రాబోయే ఐదేళ్లకు ఈ ఎన్నికలే కీలకం :
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రధానమైనవని, రాబోయో ఐదేళ్లకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని సోనియా గాంధీ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం ఎలాంటి హమీలు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజల మధ్య విభేదాలు తప్ప ప్రభుత్వం చేసింది ఏమి లేదని, అన్నిరకాలుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పంటపండిస్తే.. కనీసం గిట్టుబాటు ధర లేదని, ఎరువుల కోరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. యూపీలోని యువత చాలా మంది ఉన్నతచదువులతో మంచి విద్యావంతులయ్యారని, అయితే ఉద్యోగాల కోసం సిద్దమైన వారికి ప్రభుత్వం ఎలాంటి చేయూతనివ్వలేదని, పైగా ఇంట్లోనే కూర్చోబెట్టిందని బీజేపీ ప్రభుత్వంపై సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 12 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కానీ వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.

ధరల నియంత్రణలో కేంద్రం విఫలం :
బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల లక్షలాది మంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని సోనియా గాంధీ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్దాయికి చేరాయని, ఎల్పీజీ వంటగ్యాస్ ధరలు పెంచడంతో సగటు మనిషి ఇంటిని నడపడం కష్టంగా మారిందని సోనియా వాపోయారు. ఇంధన ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ధరలను నియంత్రించే శక్తి సామర్థ్యాలు బీజేపీ ప్రభుత్వానికి లేవని విమర్శించారు. వంటనూనెల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో తాను చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో ఏనాడైనా ఈ స్థాయిలో ధరలను చూశారా? అని ప్రశ్నించారు.

లాక్ డౌన్‌లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, వ్యాపారాలు మూతపడి, ఉద్యోగాలు, ఉపాధి లేక ఎన్నో అవస్థలు పడ్డారని తెలిపారు. లాక్ డౌన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతరాహిత్యంగా వ్యవహరించాయని దుయ్యబట్టారు. సమయం ఇవ్వకపోవటం వల్ల లక్షల మంది కార్మికులు కాలినడకన తమ స్వస్థలలాకు పోవాల్సి వచ్చిందని, మోడి, యోగీ ప్రభుత్వాలు అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని విమర్శించారు. కరోనా కారణంగా ఎంతో మంది జీవితాలు అతాలకుతలమయ్యాయని, వారిని కనీసం పట్టించుకోలేదని సోనియా గాంధీ ధ్వజమెత్తారు.

యూపీ ప్రజలు కళ్లు తెరిచారు…
లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు, చిరు వ్యాపారులు.. ఎన్నో ఇబ్బందులను పడ్డారని సోనియా గాంధీ గుర్తు చేశారు. వందలాది కిలోమీటర్లు కాలి నడకన నడవాల్సిన దుస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చాయని విమర్శించారు. వేలాదిమంది వలస కార్మికుల ఇబ్బందులను పట్టించుకోవడంలో మోడీ-యోగి ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ధ్వజమెత్తారు. ఎలాంటి ఆర్థిక సహకారాన్ని అందించలేకపోయాయని అన్నారు. యోగి ప్రభుత్వం వలస కార్మికులను ఆదుకోవడంలో చేతులెత్తేసిందని సోనియాగాంధీ విమర్శించారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని సోనియా గాంధీ యూపీ ఓటర్లకు సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన పంటకు సరైన ధరను అందించడంలో యోగి ప్రభుత్వం విఫలమైందని సోనియా గాంధీ ఆరోపించారు. కనీసం ఎరువులను సైతం సమకూర్చలేకపోయిందని విమర్శించారు. యూపీ ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని, ఇక మీ ప్రభుత్వం దిగిపోవాల్సిన సమయం వచ్చిందని, రాష్ట్ర ప్రజలు కళ్లు తెరిచారని సోనియా గాంధీ అన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటిదాకా మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 10, 14, 20వ తేదీల్లో మొత్తం 172 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా నాలుగు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7న మొత్తం 231 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Read Also : UP Election 2022: యూపీలో పోలింగ్ శాతం ఏం చెబుతోంది.. అధికార మార్పు జరుగుతుందా?

ట్రెండింగ్ వార్తలు