యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించాలన్నది చాలా మంది కల. దేశంలో అత్యంత క్లిష్టమైన పరీక్షలలో ఒకటి ఇది. ఇందులో విజయవంతం కావాలంటే తెలివి, మానసిక స్థైర్యం, అలాగే సంవత్సరాల పాటు సాధన, పట్టుదల కావాలి. అటువంటి లక్షణాలు ఉన్న మహిళే ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా, పిల్కువాకు చెందిన ఆష్నా చౌధురి. మొదట ఆమె మోడల్‌గానూ పని చేయడం గమనార్హం.
ఆష్నా విద్యాభ్యాసంలో ఎంతో ప్రతిభ చూపేవారు. 12వ తరగతిలో 96.5% మార్కులతో మెరుగైన ప్రతిభ కనబరిచారు. ఆ తర్వాత లేడీ శ్రీ రామ్ కాలేజ్ (ఢిల్లీ యూనివర్సిటీ)లో ఇంగ్లిష్ లిటరేచర్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. దక్షిణ ఆసియా విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు.
సామాజిక సేవ పట్ల ఆకర్షితురాలై పేద పిల్లలకు సహాయపడే ఒక ఎన్జీవోలో పనిచేశారు. ఆ తర్వాత ఆమె యూపీఎస్సీ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు. 2019 నుంచి ప్రయత్నించి తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యారు. కానీ ఆమె వెనకడుగు వేయకుండా వ్యూహాన్ని మార్చుకుని, మాక్ టెస్టులతో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు.
మూడో ప్రయత్నంలో 2022లో ఆలిండియా 116వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్ సాధించినా ఆష్నా తన ఐపీఎస్‌ను ఎంచుకున్నారు. పోలీస్ సర్వీస్‌లో సేవలందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె కోచింగ్ కూడా తీసుకోకుండా ఈ విజయాన్ని సాధిచండం గమనార్హం.
అంత ఓపికగా ఆమె పరీక్షను క్లియర్ చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె తండ్రి పేరు అజిత్ చౌధురి.. ఆయన ప్రొఫెసర్. ఆష్నా తల్లి పేరు ఇందూ సింగ్. సోషల్ మీడియాలోనూ ఆష్నా యాక్టివ్‌గా ఉంటారు. కొత్త ఫ్యాషన్, తన టూర్లకు సంబంధించిన వివరాలను పంచుకుంటారు.