వీబీ జీ రామ్ జీ పథకంలో కొత్త మలుపు.. మనకు మరింత లాభం ఎలా దక్కుతుందంటే?

గతంలో మాన్యువల్ ధ్రువీకరణలో మోసాలు, అవినీతి ఎక్కువగా ఉండేవి. అనేక స్థాయుల్లో మధ్యవర్తుల అవినీతి కారణంగా లబ్ధిదారుల నిధులు మాయమయ్యేవి.

వీబీ జీ రామ్ జీ పథకంలో కొత్త మలుపు.. మనకు మరింత లాభం ఎలా దక్కుతుందంటే?

VB G RAM G (Image Credit To Original Source)

Updated On : January 10, 2026 / 7:23 PM IST
  • వీబీ జీ రామ్ జీపై చాలా మందిలో సందేహాలు
  • డిమాండ్ ఆధారిత పని కేటాయింపు విధానంలో సమస్యలు
  • సప్లై ఆధారిత విధానం బెటర్

VB G RAM G: గ్రామీణ ఉపాధి వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్-గ్రామీణ (వీబీ జీ రామ్ జీ) చట్టాన్ని తీసుకొచ్చింది. యూపీఏ హయాంలో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంఎజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వీ బీ జీ రామ్ జీ ఇటీవలే చట్టరూపం దాల్చింది.

అయితే, దీనిపై చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు భరించాల్సి రావడం, 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు పెంచడం, ఉపాధి పనులకు తప్పనిసరిగా విరామం ఇవ్వడం వంటి అంశాలూ పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇటువంటి సందేహాలన్నింటికీ సమాధానాల సమాహారాన్ని చదవండి…

సాధారణంగా గ్రామీణ ప్రజలు వ్యవసాయ పనులు కూడా చేస్తుంటారు. ఉపాధి హామీ కింద వేరే పనులు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ సీజన్‌లలో ఉపాధి పథక పనులు కొనసాగితే కార్మికులు ప్రభుత్వ ఉపాధి పనులకే వెళ్లిపోతారు. అప్పుడు రైతులకు వ్యవసాయ పనుల కోసం కార్మికులు (కూలీలు) దొరకరు. ఈ సమస్య రాకుండా ఉండేందుకే ఉపాధి పనులకు కొంతకాలం విరామం ఇస్తారు.

దీంతో.. పంటల విత్తనాలు వేయడం, కోత, నాట్లు వంటి పనులు అత్యధికంగా జరిగే సీజన్‌లలో 60 రోజుల పని విరామం తప్పనిసరి. అంటే ఏడాదిలో నిర్దిష్టంగా 60 రోజుల పాటు ఉపాధి పథకం కింద పనులు ఇవ్వకూడదనే నిబంధన ఉంది.

యూపీఏ హయాంలో కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న శరద్ పవార్ అప్పటి గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్‌కు అనేక లేఖలు రాసి ఎంఎజీఎన్ఆర్ఈజీఏలో ఏడాదిలో కనీసం మూడు నెలలను ఆఫ్ పీరియడ్‌గా పరిగణించాలని కోరారు. విత్తనాలు విత్తే కాలం, కోత కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు.

Also Read: Sankranti 2026 Date: సంక్రాంతి ఎప్పుడు? తేదీ, పూజా ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి..

వ్యవసాయ అవసరాలకు మూడు నెలల పూర్తి విరామం అవసరం లేదని భావించి, ఉపాధి హామీ హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకు సమతుల్యతగా ఇప్పుడు 60 రోజులుగా నిర్ణయించారు.

అమలు బాధ్యత రాష్ట్రాలదే
అప్పటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం వ్యయాల్లో ఒక నిర్దిష్ట శాతం రాష్ట్రాలు భరించాలని కోరారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం మెటీరియల్ వ్యయంలో 75% భరించింది. మిగిలిన 25% రాష్ట్రాలు భరించాయి. కేంద్ర ప్రాయోజిత గ్రామీణ గ్యారంటీ పథకాల అమలులో ప్రధాన బాధ్యత రాష్ట్రాలదే. వ్యయ భాగస్వామ్యం ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహిస్తుంది. రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం పెరగటం ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు, ఆస్తుల నిర్వహణలో బాధ్యతను పెంచుతుంది.

డిమాండ్ ఆధారిత పని కేటాయింపు విధానం (కార్మికుల అభ్యర్థనకు వీలుగా పని రోజులు కల్పించాలనే విధానం) వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వ బడ్జెట్‌కు గరిష్ఠ పరిమితి ఉంటుంది. అంచనా లేని వ్యయం, అమలులో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది.

సప్లై ఆధారిత విధానం (ముందస్తు ప్రణాళికతో పనులు కల్పించే విధానం) మరింత ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. గ్రామీణ పనులు ఇప్పుడు ‘వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు’ ద్వారా ప్రణాళికరూపం దాల్చుతాయి. కనీసం 125 రోజులు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రాలకు ఉంటుంది. సామర్థ్యాన్ని బట్టి 125 రోజులకన్నా ఎక్కువ ఇవ్వవచ్చు. 15 రోజుల్లో పని ఇవ్వకపోతే అలవెన్స్ చెల్లింపు ఉంటుంది. కార్మికులు చట్టం ద్వారా సాధికారత పొందుతారు.

కార్మికుడు ఉపాధి కోరినా నిర్దేశిత గడువులో పని ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి దక్కుతుంది. ఒక రాష్ట్రం సాధారణ కేటాయింపును మించి వెళ్తే అది ఆ రాష్ట్ర విధాన నిర్ణయం వల్లే జరుగుతుంది.. అంతేగానీ, చట్టంలోని పరిమితుల వల్ల కాదు. అందువల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం ఉన్నా కార్మికుల చట్టబద్ధ హక్కులు పూర్తిగా రక్షితంగా ఉంటాయి.

అవినీతికి చెక్ 
గ్రామీణ పేదరికం 2011-12లో 25.7% నుంచి 2023-24లో 4.86%కు తగ్గిన నేపథ్యంలో గ్రామీణ ఉపాధి పునర్నిర్మాణం అవసరమైంది. కఠిన బయోమెట్రిక్ హాజరు నిబంధనలు (వేలిముద్ర, ముఖ గుర్తింపు ఆధారంగా హాజరు నమోదు చేసే విధానం) ఇండియా స్టాక్‌తో అనుసంధానం చేయటం ద్వారా ‘ఘోస్ట్ లబ్ధిదారులు’ నిధులను దారి మళ్లించే అవకాశాలు ఉండవు.

ఘోస్ట్ లబ్ధిదారులు అంటే.. ఉపాధి పనులు చేయని వ్యక్తుల పేర్లు, మరణించినవారి పేర్లు, వలస వెళ్లిపోయినవారి పేర్లు ఉపయోగించి పథకాల నిధులను అక్రమంగా పొందే నకిలీ లబ్ధిదారులు.

జీ రామ్‌ జీ చట్టం కేవలం ఫ్రేమ్‌వర్క్‌కు కొత్త పేరు ఇస్తుంది. ఉపాధి గ్యారంటీ, కార్మిక హక్కులు, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ, రక్షణాత్మక నిబంధనల్లో మార్పు లేదు. మహాత్మా గాంధీ పేరు తొలగింపుతో “నైతిక అధికారానికి దెబ్బ” అనే కొందరి వాదన వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

గతంలో మాన్యువల్ ధ్రువీకరణలో మోసాలు, అవినీతి ఎక్కువగా ఉండేవి. అనేక స్థాయుల్లో మధ్యవర్తుల అవినీతి కారణంగా లబ్ధిదారుల నిధులు మాయమయ్యేవి. గతంలో ఆధార్ సీడింగ్ ద్వారా కేవలం 0.76 కోట్ల కార్మికుల ధ్రువీకరణ మాత్రమే జరిగింది. ఈ వ్యవస్థ బలహీనంగా ఉండేది. ఇప్పుడు వ్యవస్థ సంస్థాగతంగా అమలులోకి వచ్చింది.

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ప్రభుత్వం నుంచి కార్మికుడి బ్యాంకు ఖాతాకు నేరుగా వేతన బదిలీ చేసే డిజిటల్ వ్యవస్థ) 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పూర్తిగా అమల్లో ఉంది. వేతనాలు నేరుగా కార్మికుడి ఖాతాకు చేరుతాయి.