Uttarakhand Tunnel Accident: ఘోర ప్రమాదం.. సొరంగంలోకి దూసుకొచ్చిన నీరు, మట్టి.. ఏడుగురు మృతి.. మరికొందరు గల్లంతు
Uttarakhand Tunnel Accident : ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ లో చిక్కుకొని ఏడుగురు మృతి చెందారు.
Uttarakhand Chamoli Tunnel Accident 7 Killed
Uttarakhand Tunnel Accident: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ హైడ్రోపవర్ ప్రాజెక్టు సొరంగంలోకి ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, శిథిలాలు దూసుకురావడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు సొరంగంలో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.
చమోలీ జిల్లా పిపల్‌కోటిలోని టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (THDC) ప్రాజెక్టు వద్ద గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రాజెక్టు ప్రాంతంలో మొత్తం 22మంది కార్మికులు పనిచేస్తున్నారు. సుమారు 6.30 గంటల సమయంలో భారీగా నీరు, శిథిలాలు సొరంగంలోకి ప్రవేశించాయి. నీటి ఉధృతికి పలువురు కార్మికులు సొరంగం బయటకు కొట్టుకొచ్చారు. ఈ ఘటనలో 14మంది కార్మికులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికుల కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారులో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. సహాయక, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
చమోలీ జిల్లాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగుల్లో నీటిమట్టాలు పెరిగాయి. ఇటీవల జిల్లాలోని నీతి వ్యాలీ ప్రాంతంలో కూడా నీటి ఉధృతికి ఓ వంతెన కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో సొరంగంలోకి భారీగా నీరు, మట్టి చేరడానికి వర్షాల ప్రభావం కూడా కారణమై ఉండొచ్చని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి.
