ISRO Chairman V Narayanan (Image Credit To Original Source)
V Narayanan: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవసహిత ప్రయోగం “గగన్‌యాన్” ప్రాజెక్టులో భాగంగా శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరీక్షలను చేపట్టనున్నారు. దీని గురించి ఇవాళ ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ మరిన్ని వివరాలు తెలిపారు.
చెన్నైలో నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ.. “గగన్‌యాన్ ప్రోగ్రామ్‌ను 2027లో చేపట్టాలని ప్రణాళికలు ఉన్నాయి. దానికంటే ముందు మూడు మానవరహిత మిషన్లు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం మేము ఇందులోని మొదటి మానవరహిత మిషన్ కోసం పనిచేస్తున్నాం. ఎన్నో రకాల పరీక్షలను చేస్తున్నాం.
Also Read: Medaram Jatara 2026: మేడారానికి లక్షలాది మంది.. ఆ ప్రధాన రాహదారిపై 5 కి.మీ.కు పైగా ట్రాఫిక్ జామ్
గగన్‌యాన్‌లో సేఫ్టీ చాలా ముఖ్యం. అన్ని వ్యవస్థలను పరీక్షించి, గగన్‌యాన్ ప్రోగ్రామ్‌కు సంబంధించి వాటికి ఉన్న అర్హతను నిర్ధారించుకోవాల్సి ఉంది. పూర్తిస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాల్సి ఉంటుంది. ఆ దిశగానే మేము పనిచేస్తున్నాం” అని అన్నారు.
8,000కు పైగా గ్రౌండ్ పరీక్షలు సక్సెస్
జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా జీ1 ప్రయోగాన్ని చేపట్టే పనులు చివరి దశకు చేరుకున్నాయి. గగన్‌యాన్ ప్రాజెక్టులో తొలుత వ్యోమగాములు లేకుండా జరిపే మొదటి పూర్తి స్థాయి పరీక్షా ప్రయోగమే జీ1. గగన్‌యాన్ ప్రయోగానికి అర్హత నిర్ధారణకు అవసరమైన అన్ని ప్రొపల్షన్ పరీక్షలు పూర్తయ్యాయని ఇస్రో స్పష్టం చేసింది.
మొత్తం 8,000కు పైగా గ్రౌండ్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. సాఫ్ట్‌వేర్ సిమ్యులేషన్ల పనులు కొనసాగుతున్నాయి. కీలకమైన డిజైన్ లోపాలు, సిమ్యులేషన్ అంతరాలను పరిశీలించేందుకు ఇంటిగ్రేటెడ్ మిషన్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశారు. తదుపరి దశకు బలమైన వ్యూహాన్ని అమలు చేయడమే దీని లక్ష్యం.
జీ1 మిషన్‌లో హ్యూమనాయిడ్ రోబో “వ్యోమమిత్ర”ను 400 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్‌కు పంపనున్నారు. మూడు రోజుల ఈ ప్రయోగంలో జీవన సహాయక వ్యవస్థలు, రీ ఎంట్రీ, రికవరీ వ్యవస్థల పనితీరును ధ్రువీకరిస్తారు.
గగన్‌యాన్ జీ1ను 2026 మార్చికు షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత 2026 చివరలో రెండో మానవరహిత ప్రయోగం జీ2 ఉంటుంది. 2027లో వ్యోమగాములతో కూడిన ప్రయోగం ప్రణాళికలో ఉంది. ఆ వ్యోమగాముల్లో శుభాంశు శుక్లాతో పాటు ప్రసాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ ఉన్నారు.