ఆడపిల్ల పుడితే మైనస్ అని మగపిల్లాడు పుడితే ప్లస్ అనే మాట ఈ ఆధునిక సమాజంలో ఇంకా పోలేదు. అబ్బాయిలకు ఏమీ తక్కువ కాకుండా తల్లిదండ్రులకు చూసుకుంటున్నా..ఆడా మగా అనే బేధం మాత్రం పోలేదు.ఆడపిల్ల పుట్టిందని..హాస్పిటల్ ఫీజులు కూడా కట్టకుండా నిర్థాక్షిణ్యంగా భార్యను బిడ్డను హాస్పిటల్ లోనే వదిలేసిన ఎన్నో ఘటనలు ఉన్నాయి.
కానీ ఆడపిల్ల లేనిదే ప్రపంచ లేదు. మానవ మనుగడే లేదు. ఈ నిజాన్ని మాత్రం కొంతమందిస్వార్థపరులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అటువంటి మనుష్యల్లో మార్పు తీసుకురావాలని..ఆడపిల్ల ఏమాత్రం తక్కువ కాదని తెలియజేయటానికి ఓ డాక్టరమ్మ తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోదామె. ఫీజులే కాదు ఆస్పత్రి ఖర్చులు కూడా ఒక్క పైసా కూడా తీసుకోదు ఆ డాక్టరమ్మ. మాతృత్వానికి ఆడమగా తేడాలేదంటుందామె. ఆ డాక్టరమ్మ పేరు శిప్రాధర్. వారణాశిలో ప్రముఖ గైనకాలజిస్ట్.
కొన్నేళ్లుగా ఆమె తన ఆస్పత్రిలో ఆడపిల్ల పిడితే ఆస్పత్రి ఖర్చులు అన్నీ తానే భరించి తల్లీనీ బిడ్డను సంతోషంగా పంపిస్తారామె. ఇప్పటివరకూ శిప్రాధర్ కొన్ని వందల ఆడపిల్లలకు ప్రాణం పోశారు. వారిలో ఒక్కరి వద్దనుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదు.
దీని గురించి శిప్రాధర్ మాట్లాడుతూ..మగపిల్లాడు పుడితే సంబరాలు చేసుకుంటారు..స్వీట్లు పంచి నానా హడావిడీ చేస్తారు..అదే ఆడపిల్ల పుడితే మాత్రం అయ్యో…ఆడపిల్లా? ఇక నువ్వు అయిపోయినట్లేరా..నీకిక ఖర్చులు తప్ప ఏమీ మిగలవ్ అంటూ మొహం మీదనే అనేస్తారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆడపిల్లలు దేంట్లోనూ తీసిపోరని అందరూ గ్రహించాలని అంటున్నారు..
ఆడపిల్ల పుడితే అయ్యో అనే మాటలు వినీ వినీ ఉన్న ఆమె వారి కోసం ఏదన్నా చేయాలనిపించింది. ఓ నిర్ణయం తీసుకుంది. తన ఆస్పత్రితో ఆడపిల్ల పుట్టిన వారి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడని నిర్ణయించుకుంది. అదే మాట తన భర్తతో చెప్పింది. సరే అని భర్త ప్రోత్సహించాడు.దానికి ఆమె చాలా సంతోషించింది.
‘బేటీ హే థో సృష్టి హే (ఆడపిల్లను కంటేనే ప్రపంచం ఉంటుంది) అని అంటారామె. అదే నినాదంతో ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు శిప్రాధర్. అంతేకాదు..ఆడపిల్లకు పోషకాహారం అందించేందుకు చిరుధాన్యాలను ఉచితంగా పంచుతుంటారు. అంతేకాదు డాక్టర్ గా బిజీగా ఉన్నా సరే సమయాన్ని కేటాయించుకుని పేదింటి ఆడపిల్లలకు చదువు చెబుతుంటారు. జీవితంతో ఎదగటానికి చదువు ఎంతగా ఉపయోగపడుతుందో చెబుతుంటారు. కాబట్టి ప్రతీ ఒక్కరూ చదువుకోవాలని చెబుతుంటారు. చాలామంది పిల్లల చదువులకు ఫీజులు కూడా కడుతుంటారు వారణాశి గైనకాలజిస్ట్ డాక్టర్ శిప్రాధర్.