Viral Video: లెక్చరర్ చెంపచెళ్లుమనిపించిన అమ్మాయి.. వీడియో వైరల్

ఒక సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ.. “సాయంత్రం ఫిర్యాదు అందింది. అధికారులు వీడియో చూశారు. సీసీటీవీ దృశ్యాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది” అని అన్నారు.

Viral Video: లెక్చరర్ చెంపచెళ్లుమనిపించిన అమ్మాయి.. వీడియో వైరల్

Updated On : October 17, 2025 / 7:41 AM IST

Viral Video: ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) సంయుక్త కార్యదర్శి దీపికా ఝా గురువారం డా.భీమ్ రావు అంబేద్కర్ కాలేజ్ లెక్చరర్ సుజిత్ కుమార్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అలాగే, సుజిత్‌పై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన సమయంలో ఢిల్లీ పోలీసు సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. సుజిత్‌పై దాడి ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ఈ విషయంలో ఫిర్యాదు అందిందని, దానిని పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఈ ఘటన కళాశాల క్రమశిక్షణ కమిటీ సమావేశంలో జరిగింది. ఆ కమిటీకి సుజిత్ కుమార్ కన్వీనర్. ఈ సమావేశాన్ని ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనపై చర్చించడానికి నిర్వహించారు.

ఆ ఘటనలో ఏబీవీపీ సభ్యులు ఇతర విద్యార్థులపై దాడి చేశారని ప్రజాస్వామ్య ఉపాధ్యాయుల వేదిక (డీటీఎఫ్) తెలిపింది. ఏబీవీపీ సభ్యుల్లో దీపికా ఝా కూడా ఒకరు. ఆమె ఆ సమావేశానికి ఆహ్వానం లేకుండానే ప్రవేశించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఝా పక్కన సోఫాపై కూర్చుని సుజిత్ పలువురితో చర్చిస్తున్నట్లు ఈ వీడియోలో కనపడుతోంది. అలాగే, నలుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. చర్చలో వాగ్వివాదం చోటుచేసుకున్నప్పుడు ఝా లేచి సుజిత్ కుమార్‌ను చెంపదెబ్బ కొట్టింది.

వెంటనే ఒక మహిళా కానిస్టేబుల్ ఝాను పక్కకు లాగి కూర్చోబెట్టింది. సుజిత్‌ మళ్లీ లేవబోతే ఒక వ్యక్తి ఆయనను మళ్లీ కుర్చీలోకి నెట్టాడు. ఒక సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ.. “సాయంత్రం ఫిర్యాదు అందింది. అధికారులు వీడియో చూశారు. సీసీటీవీ దృశ్యాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది” అని అన్నారు.