Underwater Metro Service : ఇదో అద్భుతం.. కోల్‌కతాలో భారత్ ఫస్ట్ అండర్​ రివర్ మెట్రో సేవలు.. మార్చి 6నే ప్రారంభం!

Underwater Metro Service : కోల్‌కతాలో నిర్మించిన భారత మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. రేపు (మార్చి 6న) ప్రధాని నరేంద్ర మోదీ అండర్ రివర్ మెట్రో టన్నెల్‌‌ను ప్రారంభించనున్నారు.

Video Shows India's First-Ever Underwater Metro Service In Kolkata

Underwater Metro Service : కోల్‌కతాలో నిర్మించిన భారత మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. రేపు (మార్చి 6న) ప్రధాని నరేంద్ర మోదీ అండర్ రివర్ మెట్రో టన్నెల్‌‌ను ప్రారంభించనున్నారు. కోల్‌కతా మెట్రో ఎక్స్‌టెన్షన్, హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ మెట్రో సెక్షన్‌ను కలిగి ఉంది. హుగ్లీ నది కింద కోల్‌కతా ఈస్ట్, వెస్ట్ మెట్రో కారిడార్ నుంచి దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ అండర్ రివర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు. హౌరా మెట్రో స్టేషన్‌లో దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌ కలిగి ఉంటుంది.

45 సెకన్లలోనే గమ్యం చేరుకోవచ్చు :
ఈ సొరంగ రైలు మార్గం ప్రారంభోత్సవానికి ముందు, మెట్రో టన్నెల్ వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసింది. ముఖ్యంగా, 520 మీటర్ల పొడవు కలిగిన ఈ టన్నెల్​ నుంచి 45 సెకన్లలో మెట్రో రైలు దూసుకుపోనుంది. కోలకతాకు వెళ్లే ప్రయాణికులకు నది కింది నుంచి ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉండనుంది. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్‌ను కలుపుతుంది. తూర్పు-పశ్చిమ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లలో, 10.8 కిలోమీటర్లు భూగర్భ కారిడార్‌ను కలిగి ఉంది. ఇందులో హూగ్లీ నది దిగువన గ్రౌండ్‌బ్రేకింగ్ సొరంగం కూడా ఉంది.

మొత్తం ఆరు స్టేషన్లు.. భూగర్భంలో మూడు స్టేషన్లు :
నివేదిక ప్రకారం.. నీటి అడుగున మెట్రో ఆరు స్టేషన్లను కలిగి ఉంది. అందులో మూడు భూగర్భంలో ఉన్నాయి. నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల ప్రయాణికులకు అండర్ రివర్ మెట్రో రైలు రాకతో మరింత సౌకర్యంగా ఉండనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రవాణా అవసరాలను మాత్రమే కాకుండా.. కోల్‌కతాలో ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం దీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. తూర్పు-పశ్చిమ మెట్రో కారిడార్ కోసం పని 2009లో ప్రారంభమైంది. 2017లో హుగ్లీ నది కింద టన్నెలింగ్ పనులు ప్రారంభమయ్యాయి.

సొరంగం సెక్షన్ గురించి కోల్‌కతా మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నది నీటి మట్టానికి 16 మీటర్ల దిగువన ప్రయాణిస్తున్నాం. ఇది ఒక అద్భుతం. రోజువారీ 7 లక్షల మంది ప్రయాణీకులను ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ మెట్రో రైలు టన్నెల్‌లో అన్ని భద్రతా ఫీచర్లు ఉన్నాయని రైల్వే బోర్డ్ మెంబర్-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనిల్ కుమార్ ఖండేల్వాల్ చెప్పారు.