Vijay Mallya: విజయ్ మాల్యా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన గురించి చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. విజయ్ మాల్యాకు చెందిన లగ్జరీ గోవా మ్యాన్షన్ పేరుని బాలీవుడ్ జంట మార్చటమే. దీంతో మరోసారి విజయ్ మాల్యా గురించి డిస్కషన్ జరుగుతోంది. ఏంటీ లగ్జరీ గోవా మ్యాన్షన్, దాని ప్రత్యేకత ఏంటి, మాల్యా నికర ఆస్తి ఎంత అన్న వివరాలు ఆసక్తికరంగా మారాయి.
ఒకప్పుడు విజయ్ మాల్యా విలాసవంతమైన జీవనశైలికి చిహ్నంగా ఉన్న గోవాలోని ఐకానిక్ కింగ్‌ఫిషర్ విల్లాను 2017లో ఒక బాలీవుడ్ నటుడికి అమ్మేశారు. ఇప్పుడు కింగ్స్ మాన్షన్ అని పిలువబడే ఈ ఆస్తిని బాలీవుడ్ నటుడు సచిన్ జోషి, అతని భార్య (మాజీ నటి ఊర్వశి శర్మ) కొనుగోలు చేశారు. గతంలో విలాసవంతమైన పార్టీలకు ప్రసిద్ధి చెందింది ఈ కింగ్ ఫిషర్ విల్లా. మాల్యా లగ్జరీ జీవనశైలికి అద్దం పట్టింది.
ఐడీబీఐ బ్యాంకుకి రూ.900 కోట్ల రుణ ఎగవేత ఆరోపణల నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఆ విల్లాను స్వాధీనం చేసుకుంది. ఆస్తిని వేలం వేయడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఆ తర్వాత సచిన్ జోషి 2017లో రూ.73.01 కోట్లకు దాన్ని కొనుగోలు చేశారు.
ఈ విల్లా 12,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు ఎకరాల స్థలంలో ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. విశాలమైన డ్యాన్స్ ఫ్లోర్లు, విలాసవంతమైన సౌకర్యాలను కలిగి ఉంది. ఈ విల్లాకు కింగ్స్ మాన్షన్‌గా పేరు మార్చాలని జోషి తీసుకున్న నిర్ణయం.. మాజీ యజమాని వారసత్వంతో రిలేషన్ ను సూచిస్తుంది.
అజాన్, జాక్‌పాట్ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందిన సచిన్ జోషి కూడా విజయవంతమైన బిజినెస్ మ్యాన్. అతని కంపెనీ వైకింగ్ వెంచర్స్.. ఆతిథ్యం, వెల్ నెస్ సహా వివిధ రంగాలలో సేవలు అందిస్తోంది. కింగ్స్ మాన్షన్ ఆవిష్కరణ సందర్భంగా జోషి మాట్లాడుతూ “ఈ రోజు నేను ప్రపంచానికి ద్వారాలు తెరిచే రోజు. ఈ ఆస్తి ‘కింగ్స్ మాన్షన్’గా పట్టాభిషేకం చేయబడింది” అని అన్నారు. విజయ్ మాల్యా చట్టపరమైన చిక్కులతో UKలోనే ఉండిపోయారు. అతడి నుండి నిధులను తిరిగి పొందేందుకు భారతీయ బ్యాంకులు చేసిన కొన్ని రికవరీలలో ఒకటే ఈ కింగ్‌ఫిషర్ విల్లా అమ్మకం.
JMJ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు జగదీష్ జోషి కుమారుడే సచిన్ జోషి. 2011లో ఆజాన్ తో హిందీ సినిమా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ముంబై మిర్రర్, జాక్ పాట్ లలో నటించారు. అనేక తెలుగు చిత్రాలలో కూడా యాక్ట్ చేశారు. ఆషికి 2 రీమేక్ నీ జతగా నేనుండాలిలో ఆదిత్య రాయ్ కపూర్ పాత్ర తెలుగు వెర్షన్ ను జోషి పోషించారు. మాజీ నటి ఊర్వశి శర్మను జోషి వివాహం చేసుకున్నారు.
విజయ్ మాల్యా నికర ఆస్తి ఎంతంటే..
ఫోర్బ్స్ ది ఇండిపెండెంట్ (UK) ప్రకారం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా నికర విలువ 2013లో 750 మిలియన్ డాలర్ల నుండి జూలై 2022 నాటికి 1.2 బిలియన్ల డాలర్లకు చేరింది. అయితే, ఆయన ఎయిర్‌లైన్ సామ్రాజ్యం ఆర్థిక పతనం, చట్టపరమైన సవాళ్లు మాల్యాను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాయి.
28 సంవత్సరాల వయసులో మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్‌కు ఛైర్మన్ అయ్యారు. మద్యం, విమానయానం, రియల్ ఎస్టేట్, క్రీడా రంగాలకు వ్యాపారాన్ని విస్తరించారు. లగ్జరీ జీవనశైలిని లీడ్ చేశారు. RCB యజమాని అవడం, ఫార్ములా 1లో స్పాన్సర్‌షిప్ ఒప్పందాలతో ప్రముఖ బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు పొందారు. అయితే విమానయాన రంగంలోకి ప్రవేశం ఆయన పతనానికి దారితీసింది.
2005లో ప్రారంభించబడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. చివరికి 9,000 కోట్ల విలువైన రుణాలను చెల్లించలేకపోయింది. 2012 నాటికి, ఆ ఎయిర్‌లైన్ కార్యకలాపాలను నిలిపివేసింది. భారతీయ నియంత్రణ సంస్థలు, బ్యాంకులు మాల్యాపై ఒత్తిడి తెచ్చాయి. 2016లో ఉద్దేశపూర్వక డిఫాల్ట్ ఆరోపణలు ఎదుర్కొనే కాసేపటి ముందు, “ముందస్తుగా షెడ్యూల్ చేసిన సందర్శన” అంటూ భారత్ నుండి UKకి వెళ్లిపోయారు మాల్యా.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసినందుకు 2017లో కోర్టు ధిక్కార కేసులో భారత సుప్రీంకోర్టు మాల్యాను దోషిగా ప్రకటించింది. నాలుగు నెలల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించింది. మాల్యాను అప్పగించాలని భారత్ అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకపోయింది. మాల్యా ఇంగ్లాండ్‌లోనే నివసిస్తున్నారు. అక్కడ తన బస “పూర్తిగా చట్టబద్ధమైనది” అని పేర్కొన్నారు.
ఆస్తుల విషయానికొస్తే మాల్యాకు న్యూయార్క్‌లోని ట్రంప్ ప్లాజాలో ఒక పెంట్ హౌస్, మూడు లగ్జరీ కాండోలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఆయన కుమార్తెతో కలిసి యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారని తెలుస్తోంది. నివేదికల ప్రకారం, మాల్యాకు ఫ్రాన్స్‌లోని సెయింట్-మార్గరైట్ ద్వీపంలో.. ఎస్టేట్ కూడా ఉంది.