Virat Kohli Reaction Bengaluru Stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా నిలిచింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదీస్తూ ఛాంపియన్ గా మారిన ఆర్సీబీకి ఘన స్వాగతం పలికేందుకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్పందించారు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. తొక్కిసలాట ఘటనతో మాటలు రావట్లేదు. తీవ్రంగా కలిచివేసింది అని పేర్కొన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్ మెంట్ కూడా తొక్కిసలాట ఘటనలపై ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘బెంగళూరులో జరిగిన దురదృష్టకర సంఘటనతో మేము తీవ్ర వేదనకు గురయ్యాం. అందరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యమైంది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. మా అభిమానులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీడియాలో వచ్చిన కథనాలతో ఈ ఘటన గురించి మాకు తెలిసింది. దీని గురించి తెలిసిన వెంటనే మా కార్యక్రమాలను రద్దు చేసుకున్నాం. స్థానిక అధికారులకు మా పూర్తి సహకారం అందిస్తాం. ఈ సందర్భంగా మాకు మద్దతుగా నిలిచే వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని ఆర్సీబీ యాజమాన్యం పేర్కొంది.
ఈ ఘటనపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ స్పందించారు. ఆర్సీబీ గెలుపు సంబరాల గురించి తమకు సమాచారం లేదని అన్నారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. సంబంధిత అధికారులు ఆ పని చూసుకుంటారు. అది బీసీసీఐ కార్యక్రమం కాదు. ఇలా జరగడం బాధాకరం. వేడుకలు విషాదంగా మారాయి. అది ప్రణాళిక ప్రకారం జరిగిన కార్యక్రమమా, కాదా అన్నదానిపై నాకు సమాచారం లేదు. నేను ఆర్సీబీ ప్రతినిధులకు ఫోన్ చేస్తే స్టేడియంలో వేడుకల తాలూకు శబ్దాలు వినిపించాయి. వాళ్లకు బయట ఏం జరుగుతుందో తెలియలేదనుకుంటా. త్వరగా వేడుకలను ముగించాలని మాత్రం చెప్పానని ధూమల్ చెప్పారు.