Cm Siddaramaiah: కుంభమేళాలో తొక్కిసలాట జరగలేదా? ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి- బీజేపీపై సీఎం సిద్ధరామయ్య ఫైర్
సమగ్ర విచారణకు ఆదేశించాం. 15 రోజుల్లో నివేదిక వస్తుంది. విచారణలో తప్పు ఎవరిదో తేలుతుంది.

Cm Siddaramaiah: చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అన్నారు. ఈ ఘటనలో 11 మంది చనిపోయారని, 33 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు 10లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం సిద్ధరామయ్య. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించామని, 15 రోజుల్లో నివేదిక వస్తుందని తెలిపారు. చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 35వేలు మాత్రమే అని.. కానీ, స్టేడియం దగ్గరికి 2 నుంచి 3 లక్షల మంది అభిమానులు వచ్చారని ఆయన చెప్పారు.
అసలు ఆ ఈవెంట్ ను ప్రభుత్వం నిర్వహించలేదన్నారు. ప్రభుత్వం కేవలం పర్మిషన్ మాత్రమే ఇచ్చిందని, క్రికెట్ అసోసియేషన్ ఆ ఈవెంట్ ను నిర్వహించిందని ఆయన వివరించారు. దేశంలో చాలా చోట్ల ఇలాంటి తొక్కిసలాట ఘటనలు జరిగాయని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. కుంభమేళాలో తొక్కిసలాట జరగలేదా? అని ప్రశ్నించారు. కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 50-60 మంది ప్రజలు చనిపోయారని గుర్తు చేశారాయన. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనను బీజేపీ నేతలు రాజకీయం చేయం సరికాదని హితవు పలికారు సీఎం సిద్ధరామయ్య.
Also Read: చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటకు కారణం ఇదే..! వెలుగులోకి షాకింగ్ వీడియో..
”ఇది ఊహించని ఘటన. స్టేడియం దగ్గరికి 2-3 లక్షల మంది వచ్చారు. సమగ్ర విచారణకు ఆదేశించాం. 15 రోజుల్లో నివేదిక వస్తుంది. విచారణలో తప్పు ఎవరిదో తేలుతుంది. గాయపడిన వారందరికీ ప్రాణాపాయం తప్పింది. బీజేపీ నేతలు ఇందులోనూ రాజకీయం చేస్తున్నారు” అని సీఎం సిద్ధరామయ్య అన్నారు.