భారత్-ఆస్ట్రేలియా మధ్య ఏడు కీలక ఒప్పందాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ గురువారం వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. వర్చువల్ ద్వైపాక్షిక సమావేశంలో భారత్-ఆస్ట్రేలియా దేశాలు ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ రంగం, మైనింగ్ సహా పలు కీలక రంగాలకు సంబంధించిన ఏడు ఒప్పందాలపై సంతకం చేసిన ఇరు దేశాధినేతలు.. ఇండో- పసిఫిక్ జలాల్లో పరస్పరం సహకరించుకోవాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు.
హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధ నౌకల ప్రాబల్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో.. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో కలిసి పని చేసే విషయమై ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి. రవాణా సహాయం కోసం ఒక దేశానికి చెందిన సైనిక స్థావరాలను మరో దేశం ఉపయోగించుకునే చారిత్రక ఒప్పందంపై భారత్, ఆస్ట్రేలియా సంతకం చేశాయి. ఈ ప్రాంతంలో చైనా ఆర్థిక, సైనిక ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో.. అమెరికాతోనూ భారత్ ఇలాంటి ఒప్పందాన్నే చేసుకుంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఆశిస్తున్న భారత్ కు ఆస్ట్రేలియా ప్రధాని మద్దతు తెలిపారు. అదే విధంగా ఎన్‌ఎస్‌జీ(అణు సరఫరాదారుల సమూహం)లో భారత్ సభ్యత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు. ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్.. మనం మహాసముద్రాన్ని పంచుకుంటున్నాం. అదే విధంగా బాధ్యతలు కూడా పంచుకోవాల్సి ఉంది. ఆరోగ్యం, భద్రత రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని వ్యాఖ్యానించారు.
యూఎన్‌ఎస్‌సీలో భారత శాశ్వత అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నామని ఆస్ట్రేలియా పునరుద్ఘాటిస్తోంది. పౌర అణు ఒప్పందాల్లో ఇరు దేశాలు పరస్పరం అండగా నిలబడతాయి. అదే విధంగా ఎన్‌ఎస్‌జీలో కూడా భారత సభ్యత్వం కల్పించే అంశంలో ఆస్ట్రేలియా పూర్తి మద్దతు తెలియజేస్తోంది అని ఇరు దేశాలు ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అదే విధంగా భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పాల్సిందిగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీని ఆస్ట్రేలియా స్వాగతించింది. కాగా యూఎన్‌ఎస్‌సీలో భారత శాశ్వత సభ్యత్వానికి పలు దేశాలు మద్దతు పలికిన విషయం తెలిసిందే.
వర్చువల్ సమ్మిట్‌ను భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో నూతన మోడల్‌గా, వాణిజ్య నిర్వహణలో నూతన మోడల్‌గా మోడీ అభివర్ణించారు. ఓ విదేశీ నేతతో ద్వైపాకిక్ష చర్చలను వర్చువల్‌గా నిర్వహించడం ఇదే తొలిసారి కాగా.. మారిసన్‌తో చర్చలు అద్భుతంగా జరిగాయని మోడీ తెలిపారు. మరోవైపు ఈ మీటింగ్ లో ఇరు దేశాధినేతల మధ్య చైనా-భారత బోర్డర్ లో నెలకొన్న పరిస్థితుల గురించి చర్చ జరగలేదని విదేశాంగశాఖ ప్రతినిధి విజయ్ ఠాకూర్ సింగ్ సృష్టం చేశారు.